నాగర్‌కర్నూల్, మే 26 : కాంటా వేసిన ధాన్యాన్ని గోదాములకు తరలించే విషయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు ఏకపక్ష వైఖరిపై నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రిగా అన్ని ప్రాంతాల రైతులను ఆదుకోవాల్సిందిపోయి సొంత నియోజకవర్గ రైతులకు మాత్రమే మేలు చేసేలా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు. దళారుల ధాన్యాన్ని నిల్వ చేసుకునేలా అధికారులకు ఆదేశాలిస్తూ నాగర్‌కర్నూల్ ప్రాంత రైతులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలోని రైతుల కాంటా చేసిన ధాన్యాన్ని నిల్వ చేసేందుకు తాడూరు మండలం ఇంద్రకల్ సమీపంలోని కాటన్ మిల్లును ఉపయోగిస్తున్నారు.
ఈ ప్రాంతానికి చెందిన చిన్న,సన్నకారు రైతుల ధాన్యాన్ని అన్లోడ్ చేయకుండా, మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాలంటూ మూడు వారాలుగా ఇక్కడి అధికారులు కొల్లాపూర్ ప్రాంతానికి చెందిన దళారుల ధాన్యాన్ని అన్లోడ్ చేస్తున్నారు. దీంతో ఆగ్రహించిన రైతులు మూడు రోజులుగా ధర్నాలు, ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి మంగళవారం ఇంద్రకల్ శివారులోని మణికంఠ కాటన్ మిల్లుకు చేరుకొని మక్కజొన్న ధాన్యం లోడింగ్, అన్లోడింగ్ పరిస్థితులను తెలుసుకొని నాగర్‌కర్నూల్ ప్రాంత రైతులకు జరుగుతున్న అన్యాయంపై అధికారులను నిలదీశారు.
‘మా ప్రాంతాల్లో ఉన్న మిల్లులు, గోదాములకు మా రైతుల ధాన్యం కాకుండా కొల్లాపూర్ ప్రాంతానికి చెందిన దళారులు కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వ చేయడం ఏమిటి?’ అని ప్రశ్నించారు. అక్కడే ఉన్న మార్క్‌ఫెడ్ డీఎంను నిలదీశారు. సన్న,చిన్నకారు రైతులు తెచ్చిన పంటను దించుకోకుండా ఇతర ప్రాంతాల నుంచి బడా షావుకార్లు, దళారులు తెచ్చిన ధాన్యాన్ని ఎలా అన్లోడ్ చేసుకొని గోదాములు, మిల్లుల్లో నిల్వ చేస్తారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వెంటనే ట్రాక్టర్లతో తెచ్చిన రైతుల ధాన్యాన్ని అన్లోడ్ చేయాలని పట్టుపట్టారు. బయటి వాహనాలను అనుమతించడంపై ఎస్సైని నిలదీశారు.
గోదాము వద్ద కుర్చీ వేసుకొని అన్‌లోడింగ్‌ను పరిశీలించారు. దిగొచ్చిన మార్క్‌ఫెడ్ అధికారులు దాదాపు వారం పదిరోజులుగా పడిగాపులు కాస్తున్న దాదాపు 40 ట్రాక్టర్ల మక్కజొన్న ధాన్యాన్ని అన్లోడ్ చేశారు. మొత్తం ట్రాక్టర్లలో వచ్చిన ధాన్యం దింపే వరకు మర్రి అక్కడే ఉండి రైతులకు మద్దతుగా నిలిచారు. మధ్యాహ్నం సమయం కావడంతో భోజనాలను తెప్పించి రైతులతోపాటు తానూ అక్కడే మక్కజొన్న సంచులపై కూర్చొని భోజనం చేశారు.