కరీమాబాద్, మే 23: వరంగల్ జిల్లా ఉర్సుగుట్ట వద్ద రూ. 1,05,38,000 విలువైన 210 కిలోల 750 గ్రాముల ఎండు గంజాయిని శుక్రవారం యాంటీ నార్కోటిక్స్ పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని అడవి అన్నవరం నుంచి శ్రీను, భాస్కర్, రాము, వినోద్ కలిసి మహబూబాబాద్ జిల్లా మరిపెడ-తొర్రూరు నుంచి వరంగల్ మీదుగా హైదరాబాద్లో గంజాయి విక్రయించేందుకు వాహనంలో బయల్దేరారు. సమాచారం అందుకున్న పోలీసులు ఉర్సుగుట్ట వద్ద తనిఖీలు చేపట్టారు.
షిఫ్ట్ కారు ఎస్కార్ట్గా ముందు వెళ్లగా ట్రాక్టర్లో 210.750 కిలోల ఎండు గంజాయిని తరలిస్తున్నారు. పోలీసులు తనిఖీలు చేసి గంజాయి రవాణా చేస్తున్న గుగులోత్ భాస్కర్, కేతావత్ రాము, కొర్ర వినోద్, విరోదుల శ్రీనును అదుపులోకి తీసుకున్నారు. తల్లిబాబు, గోవిందమ్మ, శ్రీకాంత్ పరారీలో ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. వారి నుంచి ట్రాక్టర్, స్విఫ్ట్ కారు, ఐదు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు యాంటీ నార్కోటిక్స్ పోలీసులు తెలిపారు.