భద్రాచలం, మార్చి 2: భద్రాచలంలో గంజాయి స్మగ్లర్లు మరోసారి రెచ్చిపోయారు. ఇటీవలే ఓ కానిస్టేబుల్‌ను బైక్‌తో ఢీకొట్టిన పరారైన స్మగ్లర్లు తాజాగా ఆదివారం కూడా అలాంటి దారుణానికే ఒడిగట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం బ్రిడ్జి ప్రాంతంలోని అటవీ శాఖ చెక్‌పోస్టు వద్ద కానిస్టేబుల్ రామాచారి విధుల్లో ఉన్నాడు. ఈ క్రమంలో ఓబైక్పై ఇద్దరు వ్యక్తులు సారపాక వైపు రాంగ్రూట్లో వెళ్తున్నారు. గమనించిన కానిస్టేబుల్ రామాచారి బైక్‌ను ఆపేందుకు ప్రయత్నించాడు. అయినా వారు వేగంగా వస్తుండటంతో బారికేడ్‌ను అడ్డుగా పెట్టేందుకు ప్రయత్నించాడు. స్మగ్లర్లు బైకును రామాచారి వైపు తిప్పి అతడిని బలంగా ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయారు. స్మగ్లర్లు ఢీకొట్టడంతో రామాచారి తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడే ఉన్న మరికొందరు పోలీసులు ఈ ఘటనను గమనించి రామాచారిని వెంటనే దవాఖానకు తరలించారు. రామాచారికి కాలు విరగడంతోపాటు తీవ్ర గాయాలైనట్టు వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. కాగా బైక్‌పై ఉన్న వారి వివరాలు తెలియరాలేదు. రాంగ్ రూట్లో బైక్ వెళ్లడంపైనా, డ్యూటీ కానిస్టేబుల్‌ను ఢీకొట్టడంపైనా స్థానిక పోలీసులు విచారణ చేస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా బైకు వివరాలను, ఢీకొట్టిన వారి వివరాలను సేకరిస్తున్నారు.
పది రోజుల క్రితం కూడా భద్రాచలంలో ఇదే చెక్‌పోస్టు వద్ద ఇలాంటి ఘటనే చోటుచేసుకున్నది. అప్పుడు కూడా డ్యూటీ కానిస్టేబుల్‌ను గంజాయి స్మగ్లర్లు ఢీకొట్టి వెళ్లడంతో ఆ కానిస్టేబుల్‌కు స్వల్ప గాయాలయ్యా యి. ఈ రెండు ఘటనల్లోనూ నిందితులను పట్టుకునేందుకు పోలీసులు విచారణ చేపట్టారు.
హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ) : గత ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు రూ.11 కోట్ల విలువైన 2,225 కిలోల గంజాయిని ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎక్సైజ్ సిబ్బంది పట్టుకున్నట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి ఆదివారం తెలిపారు. తెలంగాణ మొత్తంగా 2024లో 6 వేల కిలోల గంజాయిని పట్టుకుంటే ఒక ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే అత్యధికంగా 2,225 కిలోలు లభించిందని అన్నారు. గంజాయితోపాటు 16,435 కిలోల బెల్లం, 500 కిలోల పట్టిక పట్టుకుని వారి రికార్డులను వారే బ్రేక్ చేశారని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాచలం, పాల్వంచ, అశ్వారావుపేట, కొత్తగూడెం ఎక్సైజ్ పోలీసులు మొత్తం 35 కేసుల్లో భారీగా గంజాయిని, బెల్లాన్ని పట్టుకోవడంతోపాటు 35 వాహనాల్లో 11 కార్లు పట్టుబడినట్టు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆబ్కారీ భవన్లో క్యాష్ రివార్డులు, ప్రశంసాపత్రాలు అందజేయనున్నట్టు కమలాసన్‌రెడ్డి తెలిపారు.