కొత్తగూడెం ప్రగతి మైదాన్, జూలై 15: ఛత్తీస్గఢ్ ఏజెన్సీలో మావోయిస్టులు(Maoists) దారుణానికి ఒడిగట్టిన సంఘటన మంగళవారం వెలుగు చూసింది. ప్రాథమిక వివరాలు ఇలా ఉన్నాయి. చత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పీలూరు – టెకామేట గ్రామాల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న ఇద్దరిని మావోయిస్టులు హత్య చేసినట్లు తెలుస్తోంది. మృతుల్లో పీలేరు గ్రామానికి చెందిన వినోద్ మాడే ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న సిఆర్పిఎఫ్ భద్రతా దళాలు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు.
పోలీస్ ఇన్ఫార్మర్ నేపంతో మావోయిస్టులు ఈ దారుణానికి పాల్పడ్డారా? లేక ప్రతీకారేచ్ఛలో భాగమా..? అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసు అధికారులు విచారణ చేపట్టారు. ఘటన స్థలంలో ప్రత్యేక బలగాలు మోహరించి పరిసరాల్లో ఉన్న అటవీ ప్రాంతాలను మావోయిస్టుల కోసం జల్లెడ పడుతున్నాయి. ప్రతీకారంతో రగిలిపోతున్న మావోయిస్టులు అదను కోసం ఎదురుచూస్తూ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. చాప కింద నీరులా సాగుతున్న ఆపరేషన్ ‘బ్లాక్ ఫారెస్ట్’ చర్య ఉధృతం అవుతున్న నేపథ్యంలో మావోయిస్టులు ఇలాంటి దారుణాలకు పాల్పడడం శోచనీయం.