ములుగు, డిసెంబర్ 22 (నమస్తేతెలంగాణ): ములుగు జిల్లా వెంకటాపురం (నూగూరు) మండలం సూరవీడు మాజీ సర్పంచ్ కొర్స రమేశ్‌ను బుధవారం మావోయిస్టులు కాల్చి చంపారు. ఈ మేరకు భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) వెంకటాపురం-వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి శాంత లేఖను విడుదల చేశారు. మాజీ సర్పంచ్ కొర్స రమేశ్ 2019 నుంచి పోలీస్ ఇన్ఫార్మర్గా మారాడని, వెంకటాపురం (నూగూరు) ఎస్సై భూక్యా తిరుపతి వద్ద డబ్బులు తీసుకొని అతడు చెప్పిన విధంగా పనిచేస్తున్నాడని అందులో పేర్కొన్నారు. కాగా, ములుగు ఎస్పీ డాక్టర్ సంగ్రామ్‌సింగ్ జీ పాటిల్ స్పందిస్తూ.. మావోయిస్టు పార్టీ అమాయక గిరిజన ప్రజలను కొరియర్లుగా వాడుకొని అవసరం తీరాక పోలీస్ ఇన్ఫార్మర్ ముద్రవేసి అతి కిరాతకంగా చంపేస్తున్నట్టు తెలిపారు. ఈ నెల 20న కొర్స రమేశ్‌ను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు బుధవారం వెంకటాపురం (నూగూరు) సరిహద్దు గ్రామమైన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కొత్తపల్లి గ్రామం వద్ద హతమార్చినట్టు ఆయన పేర్కొన్నారు.