హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): సాయుధ పోరాట విరమణకు సంబంధించి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి పేరుతో కామ్రేడ్ సోనూ ఇచ్చిన ప్రకటన వ్యక్తిగతమైదేనని, అది పార్టీ నిర్ణయం కాదని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ స్పష్టం చేసింది. ఆయన పద్ధతి విప్లవోద్యమానికి నష్టంచేకూర్చేలా ఉన్నదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఓ లేఖ విడుదల చేసింది. సాయుధ పోరాట విరమణపై పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకునేందుకు నెలరోజుల వ్యవధి కావాలని కామ్రేడ్ సోనూ ప్రకటించడాన్ని అనాలోచిత చర్యగా పరిగణిస్తున్నామని ఆ లేఖలో పేర్కొన్నారు. ఉద్యమాన్ని విడిచి జనజీవన స్రవంతిలో కలవాలని కామ్రేడ్ సోనూ భావిస్తే పార్టీ కమిటీలో చర్చించి అనుమతి పొందవచ్చని తెలిపారు.