హైదరాబాద్: ఆపరేషన్ కగార్తో మావోయిస్టు (Maoists) పార్టీలో సరెండర్ల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పార్టీ అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాల్, తక్కళ్లపల్లి వాసుదేవరావు ఆయుధాలతో సహా లొంగిపోయిన విషయం తెలిసిందే. మరో కీలక నేత ఆశన్న తన దళ సభ్యులతో కలిసి సరెండర్ అయ్యారు. తాజాగా మావోయిస్టు రాష్ట్ర మాజీ కమిటీ సభ్యుడు, సింగరేణి కార్మిక సమాఖ్య బాధ్యుడు బండి ప్రకాశ్ (Bandi Prakash) అలియాస్ ప్రభాత్ అలియాస్ అశోక్ అలియాస్ క్రాంతి కూడా లొంగిపోయారు. మంగళవారం ఉదయం డీజీపీ శివధర్ రెడ్డి (Shivadhar Reddy) సమక్షంలో లొంగిపోయారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన ప్రకాశ్ గత 45 ఏండ్లుగా మావోయిస్టు పార్టీలో వివిధ స్థాయిల్లో పనిచేశారు. ప్రస్తుతం నేషనల్ పార్క్ ఏరియా అత్యంత కీలక ఆర్గనైజర్‌గా పనిచేస్తున్నారు. ప్రభాత్ అనే పేరుతో ప్రెస్ టీమ్ ఇన్చార్జిగా పనిచేశారు.
మందమర్రిలోని పోచమ్మ ఆలయం ఏరియాకు చెందిన సింగరేణి కార్మికుడు బండి రామారావు, అమృతమ్మ దంపతుల రెండో కుమారుడైన ప్రకాశ్.. 1982-84 మధ్య అప్పటి పీపుల్స్ వార్ అనుబంధ విద్యార్థి విభాగమైన రాడికల్ స్టూడెంట్ యూనియన్ (RSU) ‘గ్రామాలకు తరలండి’ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు. సింగరేణి కార్మిక సమాఖ్య(సికాస) ఆవిర్భావం తరువాత అందులో మిలిటెంటుగా పనిచేశారు. 1984 నవంబర్‌లో మందమర్రికి చెందిన ఏఐటీయూసీ లీడర్ వీటీ అబ్రహం హత్య కేసులో అరెస్టై జైలు జీవితం గడిపారు. ఆ తర్వాత వరంగల్ జైలు నుంచి ఆదిలాబాద్ సబ్ జైలుకు తరలించగా పీపుల్స్‌వార్ నేతలు నల్లా అదిరెడ్డి, హుస్సేన్, ముంజం రత్నయ్యతో కలిసి జైలు నుంచి తప్పించుకున్నారు. కొంతకాలానికి బయటకు వచ్చి హేమను పెండ్లి చేసుకొని సాధారణ జీవితం గడిపారు.
తిరిగి హైదరాబాద్‌లో అరెస్టు అయిన ఆయనకు చర్లపల్లి జైలులో పీపుల్స్ వార్ అగ్రనేత శాకమూరి అప్పారావు తదితరులతో ఏర్పడిన పరిచయంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస) పునరుద్ధరణ బాధ్యతను మావోయిస్టు పార్టీ ఆయనకు అప్పగించింది. ఇందులో భాగంగా రిక్రూట్మెంట్ కూడా నిర్వహించారు. అనేక కార్మక పోరాటాలకు నాయకత్వం వహించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మావోయిస్టులతో శాంతిచర్చల నేపథ్యంలో ఆసిఫాబాద్ సమీపంలోని మోవాడ్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ప్రకాశ్ అధ్యక్షత వహించారు. అయితే శాంతి చర్చలు విఫలమవడంతో మళ్లీ అజ్ఞాతంలో వెళ్లారు. కాగా, వయస్సు మీదపడటంతో పాటు షుగర్ వ్యాధితో బాధ పడుతున్న ఆయన అనారోగ్య సమస్యలతో లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్టు తెలస్తున్నది. ఆయనపై తెలంగాణ ప్రభుత్వం రూ.25లక్షల రివార్డు ప్రకటించింది.