TG DGP | తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట ముగ్గురు మావోయిస్టు సీనియర్, కీలక నేతలు శుక్రవారం లొంగిపోయారు. ఇందులో సిద్దిపేట జిల్లా వాసి కుంకటి వెంకటయ్య అలియాస్ రమేశ్, మొగిలిచర్ల చందు అలియాస్ వెంకట్రాజు, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన తోడెం గంగ అలియాస్ సోనీ ఉన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ ముగ్గురు నేతలు దక్షిణ బస్తర్ దళంలో కీలక స్థానంలో పని చేశారన్నారు. పోలీసులశాఖ పిలుపు మేరకు ముగ్గురు నేతలు జనజీవన స్రవంతిలో కలిశారన్నారు. మొగిలిచర్ల చందు (45) మావోయిస్టు స్టేట్ కమిటీ నెంబర్‌గా పని చేశాడని, ధర్మసాగరం మండల వాసి అయిన చందు దండకారణ్య సెక్రటరీగా పని చేశారన్నారు.
ఈ మధ్యకాలంలో 412 మంది మావోయిస్టులు లొంగిపోయారని.. తెలంగాణకు చెందిన 72 మంది మావోయిస్టులు లొంగిపోయారన్నారు. 12 మంది కేంద్ర కమిటీ సభ్యుల్లో పది మంది తెలంగాణ వాళ్లున్నారని పేర్కొన్నారు. మావోయిస్టు కీలక నేతలు అజ్ఞాతం వీడి పోలీసుల ముందుకు వస్తారని.. మిగతా వారు కూడా త్వరగా లొంగిపోవాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. మావోయిస్టుల్లో విభేదాలు ఉన్న మాట వాస్తవమని.. ఆయుధాల అప్పగింతపై విడుదలైన లేఖ కూడా నిజమని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం తరఫున ప్రోత్సాహకాలు అందజేస్తామన్నారు. ఇటీవల కాలంలో 403 మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా డీజీపీ పేర్కొన్నారు.
సిద్దిపేట జిల్లాకు చెందిన కుంకటి వెంకటయ్య 1990లో పీడబ్ల్యూడీ ఏర్పాటు చేసిన రైతు కూలీ సభలకు హాజరయ్యాడు. అదే సంవత్సరం అజ్ఞానంలోకి వెళ్లిపోయాడు. పిడబ్ల్యూడీ కమాండర్ బాలన్న ఆధ్వర్యంలో దళంలో చేరాడు. 35 సంవత్సరాల పాటు వివిధ హోదాల్లో పని చేశాడు. హన్మకొండ జిల్లా ధర్మసాగరం మండలం తాటికాయల గ్రామానికి చెందిన మొగిలిచర్ల వెంకటరాజు(45).. 11 సంవత్సరాల వయసులోనే మావోయిస్టు ఉద్యమంలో చేరాడు. 1993లో నర్సంపేట దళంలో రిక్రూట్ అయ్యాడు. ఆ తర్వాత రాష్ట్రస్థాయి కమిటీలో వివిధ హోదాల్లో చేశారు. మావోయిస్టులతో వచ్చిన సైద్ధాంతిక విభేదాల నేపథ్యంలో తాజాగా తన భార్య తోడెం గంగ అలియాస్ సోనితో కలిసి పోలీసుల లొంగిపోయాడు.