కొత్తగూడెం క్రైం/సారంగాపూర్, డిసెంబర్ 23 : మావోయిస్టు సీనియర్ నేత, డీకేఎస్‌జెడ్‌సీఎం ఇన్చార్జి బల్మూరి నారాయణ్‌రావు అలియాస్ ప్రభాకర్‌రావును ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ సోమవారం వెల్లడించారు. అంతగఢ్ ఏజెన్సీలో మావోయిస్టు నేతలు ఉన్నారన్న సమాచారంతో భద్రతాబలగాలు సెర్చింగ్ ఆపరేషన్స్ ప్రారంభించాయి. ఆదివారం నిర్వహించిన ఆపరేషన్‌లో దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ మొబైల్ పొలిటికల్ స్కూల్ ఇన్చార్జి బల్మూరి నారాయణరావును అరెస్ట్ చేసినట్టు ఐజీ వెల్లడించారు. జగిత్యాల జిల్లా బీర్పూర్కు చెందిన నారాయణరావు ఇంటర్ వరకు ధర్మపురిలో చదువుకున్నారు. 1984లో మావోయిస్టు పార్టీలో సభ్యుడిగా చేరారు. డీకేఎస్‌జెడ్‌సీలో లాజిస్టిక్స్ సైప్లె చేస్తూ ఎంవోపీవోఎస్ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాలకు చెందిన మావోయిస్టు అగ్రనాయకులకు సన్నిహితుడు, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు గణపతికి బంధువు. ప్రభాకర్‌రావుపై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం రూ.25 లక్షల రివార్డు ప్రకటించింది