Revanth Reddy | హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి నిర్వహించిన బహిరంగసభలో తమకు జరిగిన తీవ్ర అవమానంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరేడ్‌గ్రౌండ్ గేట్లకు తాళాలు వేసి, మహిళలను నిర్బంధించి మరీ ముఖ్యమంత్రి స్పీచ్ వినిపించడంపై పలువురు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ప్రభుత్వం ఏర్పాటుచేసిన భారీ బహిరంగసభ ఆలస్యం అవుతుండటం, ముఖ్యమంత్రి సైతం కార్యక్రమానికి ఆలస్యంగా రావడంతో మహిళలు తమ ఇండ్లకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పీచ్ ప్రారంభమైన తర్వాత, అప్పటికే సమయం మించిపోతుండటంతో కొందరు మహిళలు తమ ఇండ్లకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు పరేడ్‌గ్రౌండ్‌కు తాళాలు వేసి ఓవరాక్షన్ చేశారు. ఎంతకీ గేట్ల తాళాలు తీయకపోవడంతో మహిళలు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో ‘సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగం ముగిస్తేనే పంపిస్తాం’ అంటూ అక్కడున్న పోలీసులు తెగేసి చెప్పడంతో వారి కోపం మరింత కట్టలు తెంచుకుంది. ‘యూ యూజ్ లెస్ ఫెల్లోస్.. ఇంట్లో మగాళ్లు అందరూ ఒకే తీరుగా ఉంటారా? ఇదేం కార్యక్రమం.. ఇళ్లకు పోవాలంటే పోనివ్వరా? ఇంటి దగ్గర చిన్నపిల్లలు ఉన్నారు.. వాళ్లు ఇబ్బందులు పడుతున్నారు’ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘ఏదో మంచి కార్యక్రమం అని వచ్చినందుకు మాకు బాగానే జరిగింది’ అంటూ మరో మహిళ ఆగ్రహించారు. ‘మేం వెళ్లిపోవాలి, మమ్మల్ని వదిలేయండి’ అంటూ మరో మహిళ వేడుకున్నది. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో.. అటు సీఎం రేవంత్‌రెడ్డి తీరుపై, పోలీసుల ఓవరాక్షన్‌పై నెటిజన్లు సైతం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.