హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీజర్ రూమ్‌లో తెలుగు రాష్ర్టాల్లో సంచలనం సృష్టించిన పలు కేసులకు సంబంధించిన ఆధారాలు ఉండటం, అక్కడే అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ఫోరెన్సిక్ ల్యాబ్‌కు గుండెకాయ వంటిదని చెప్తున్న మొదటి అంతస్తులోని ‘సీజర్’ రూమ్‌లో ప్రమాదం చోటుచేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అనేక కీలక కేసులకు సంబంధించిన ఫైళ్లు, పెన్‌డ్రైవ్‌లు, హార్డ్‌డిస్క్‌లు, పేపర్ ఎవిడెన్స్‌లు, రిపోర్టులు, కొన్ని రేప్ కేసులకు సంబంధించిన కేస్ స్టడీలు, పోక్సో కేసులకు సంబంధించిన డీఎన్ఏల రిపోర్టులు కూడా అక్కడే భద్రపరుస్తారని తెలిసింది.
తెలుగు రాష్ర్టాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసుకు సబంధించిన కీలక సాక్ష్యాధారాలన్నీ అక్కడే ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొడ్డిదారిన గెలుపొందేందుకు ఓ నామినేటెడ్ ఎమ్మెల్యే కొ నుగోలుకు సంబంధించి ఇద్దరు ముఖ్య నాయకుల మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఆధారాలు, వాయిస్ రికార్డింగ్‌లు ఆ గదిలోనే ఉన్నట్టు చెప్తున్నారు. ఉమ్మడి రాష్ర్టానికి చెందిన ఓ మాజీ ముఖ్యమంత్రి వాయిస్ టెస్టింగ్‌కు సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్టు కూడా అక్కడే ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. దీంతోపాటు ఫోన్‌ట్యాపింగ్ కేసుకు సంబంధించిన కొన్ని వివరాలు, ఫైళ్లు కూడా అక్కడే ఉన్నట్టు తెలుస్తున్నది. ఓటు కు నోటు కేసుకు సంబంధించిన సుప్రీంకోర్టు వి చారణ దగ్గర పడుతున్న సమయంలో ఈ అగ్నిప్రమాదం జరగడం సంచలనంగా మారింది.
పోలీస్‌శాఖకు సంబంధించి ఎంతో కీలకమైన ఫోరెన్సిక్ ల్యాబ్‌లో భద్రత అత్యంత పటిష్టంగా ఉంటుంది. ప్రవేశద్వారం నుంచి ప్రతి గది లోపల బయట సీసీ కెమెరాలు ఉంటాయని సిబ్బంది తెలిపారు. మొదటి అంతస్తులో అగ్నిప్రమాదం జరిగిన సీజర్ రూమ్, పక్కనే ఉన్న కాన్ఫరెన్స్ హాల్లో సీసీ కెమెరాల వ్యవస్థ ఉందని అంటున్నారు. అయితే, ఆ సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తే.. వాస్తవాలు బయటికి వస్తాయని అంటున్నారు. అగ్ని ప్రమాదం సంభవించిన లేక ప్రమాదానికి కారణమైన దృశ్యాలు ఆ సీసీ కెమెరాల్లో రికార్డు అవుతాయని తెలిపారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి ఆ ఫుటేజీ ఉన్నదా లేదా అన్నదానిపై ఉన్నతాధికారులు స్పష్టతనివ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది.