హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): ‘బీజేపీ వాళ్లు మందికి పుట్టిన బిడ్డను కూడా మా బిడ్డ అని ముద్దాడుతరు’ అని సీఎం కేసీఆర్ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇది బీజేపీకి సరిగ్గా సరిపోతుంది. ఇందుకు ఉదాహరణలు అనేకం. తెలంగాణ సహా దేశంలోని ఇతర రాష్ర్టాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను, ఇతర దేశాల్లోని నిర్మాణాలను తమ ప్రాంతంలో, తమవల్లే జరిగాయని బీజేపీ ఫేక్ ప్రచారం చేస్తున్నది. నెటిజన్లకు అడ్డంగా దొరికిపోతున్నది. ఇందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఇందులో కొన్నింటిని పరిశీలిస్తే..
ముచ్చింతల్‌లో చినజీయర్‌స్వామి కట్టించిన సమతామూర్తి విగ్రహాన్ని ప్రధాని మోదీయే
కట్టిస్తున్నారని యూపీ ఎన్నికల్లో బీజేపీ ప్రచారం చేసుకొంటున్నది.
హైదరాబాద్‌లోని బైరామల్‌గూడలో టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన ఫ్లై ఓవర్‌ను బీహార్ బీజేపీ నేతలు హైజాక్ చేశారు.బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో కట్టినట్టుగా ప్రచారం చేసుకొన్నారు.
కృష్ణానదిపై ఉన్న శ్రీశైలం ప్రాజెక్టును బుందేల్‌ఖండ్‌లోని ప్రాజెక్టు అంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫొటోలతో ఫ్లెక్సీలు కొట్టించుకున్నారు.
కెనడాలో ఏర్పాటుచేసిన స్ట్రీట్లైట్ల ఫొటోలను ఢిల్లీ బీజేపీ నేతలు మార్ఫింగ్ చేసి దక్షిణ ఢిల్లీ కార్పొరేషన్లో జరిగిన అభివృద్ధిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.
మోదీ ప్రభుత్వం రూ.34 వేల కోట్లతో రోడ్లు అభివృద్ధి చేయబోతున్నదంటూ పోలెండ్‌లోని ఓ రోడ్డు ఫొటోను ఇలా వాడుకొన్నారు.