గరిడేపల్లి, సెప్టెంబర్ 15: భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి భద్రత కోసం వెళ్తున్న ఫార్చునర్ వాహనం బైక్ను ఢీకొట్టడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్రం తాసీల్దార్ కార్యాలయం సమీపంలో అబ్బిరెడ్డిగూడెం క్రాస్ రోడ్డు వద్ద చోటుచేసుకుంది. గరిడేపల్లి మండలం వెంకట్రాంపురం గ్రామానికి చెందిన కీసర జీడయ్య (42) కూలిపని నిమిత్తం గరిడేపల్లి నుంచి అబ్బిరెడ్డిగూడెం వైపు బైకుపై వెళ్తున్నాడు. హుజూర్నగర్లో పర్యటిస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి ఎస్కార్ట్ కోసం హైదరాబాద్ నుంచి వెళ్తున్న ఫార్చునర్ (బుల్లెట్ ప్రూఫ్) వాహనం జీడయ్య బైకును వెనుక నుంచి ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో జీడయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చికిత్స కోసం హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జీడయ్య కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు మిర్యాలగూడ-హుజూర్నగర్ ప్రధాన రహదారిపై పోలీస్ స్టేషన్ ఎదుట మృతదేహంతో రాస్తారోకో నిర్వహించారు. దాదాపుగా రెండున్నర గంటలపాటు రాస్తారోకో చేయడంతో ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అనంతరం స్థానిక నాయకులు, పోలీసులు నచ్చజెప్పడంతో రాస్తారోకో విరమించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్టు సీఐ చరమందరాజు, ఎస్సై నరేశ్ తెలిపారు.