రామన్నపేట, ఏప్రిల్ 18 : ప్రధానమంత్రి మన్‌కీ బాత్ వంద ఎపిసోడ్లు పూర్తయిన సందర్భంగా ఢిల్లీలో ఈ నెల 26న నిర్వహించే ప్రత్యేక కార్యక్రమానికి ప్రముఖ సాహితీవేత్త, దాశరథి పురస్కార గ్రహీత డాక్టర్ కూరెళ్ల విఠలాచార్యను రేడియో ప్రసార భారతి సీఈవో గౌరవ్ ద్వివేది ఆహ్వానించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన కూరెళ్ల విఠలాచార్య గ్రామంలో తన ఇంటిని గ్రంథాలయంగా మార్చారు. అధునాతన వసతులు కల్పించి రెండు లక్షల పుస్తకాలతో గ్రంథాలయాన్ని నిర్వహిస్తున్నారు. విషయం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ మన్‌కీ బాత్ 84వ ఎపిసోడ్లో కూరెళ్లను అభినందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలో జరిగే కార్యక్రమానికి రాష్ట్రం నుంచి ఆహ్వానించిన ఆరుగురు ప్రముఖుల్లో కూరెళ్ల ఒకరు.