మణికొండ, అక్టోబర్ 9: తన భార్య అవినీతి అధికారి అని, ఇదిగో ఆమె సంపాదించిన నోట్ల కట్టలు అంటూ ఓ భర్త రచ్చకెక్కాడు. ఇంట్లో పలు చోట్ల దాచిపెట్టిన నగదును వీడియోతీసిన సదరు భర్త దానిని సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశాడు. ఇటీవలి వరకు మణికొండ మున్సిపాలిటీలో డీఈఈగా పనిచేసిన దివ్యజ్యోతి ఇటీవలే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి బదిలీ అయ్యారు. అయితే ఆమె అవినీతి అధికారి అని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నదని, ప్రతిరోజు నోట్ల ఇంటికి నోట్ల కట్టలతో వస్తున్నదని ఆరోపిస్తూ ఆమె భర్త శ్రీపాదశర్మ మంగళవారం రాత్రి ఓ వీడియో పోస్ట్ చేశారు. అవినీతికి పాల్పడవద్దని పలుమార్లు వారించినా ఆమె వినటం లేదని చెప్పారు.
ఆమె కాంట్రాక్టర్ల వద్ద లక్షల రూపాయలు లంచం తీసుకొని వాటిని ఇంట్లో డబ్బాల్లో, సెల్ఫ్‌ల్లో పెడుతున్నదని తెలిపారు. ఆమె డబ్బు ఎక్కడెక్క దాచిందీ ఆ ప్రదేశాలన్నీ తన వీడియోలో చిత్రీకరించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో ఆమె సహ ఉద్యోగుల్లో సైతం వణుకు మొదలైంది. ఓ అధికారి ఇంతలా సంపాదనకు పాల్పడిందంటే ఆమెతోటివారు ఇంకా ఏ స్థాయిలో సంపాదించి ఉంటారోనంటూ నెటిజన్లు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత అధికారుల అవినీతికి అంతులేకుండా పోయిందని విమర్శిస్తున్నారు. అనేకమందిని అవినీతి నిరోధక శాఖ వల వేసి పట్టుకుంటున్నా.. ఇంకా పుట్టుకొస్తూనే ఉన్నారని అంటున్నారు.
వివాదం వల్లనే రచ్చకెక్కారు
శ్రీపాదశర్మ, దివ్యజ్యోతిది ప్రేమ వివాహమని, ఎందుకో ఇద్దరి మధ్య మనస్పర్థలు తారస్థాయికి చేరుకున్నాయని స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే భర్త తన భార్యపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆమె సన్నిహితులు వెల్లడించారు. వారి వివాదం ఇటీవల విడాకుల నోటీసుల వరకు వెళ్లినట్టు తెలిసింది. ఈ దంపతులకు ఓ మూడేండ్ల కొడుకు ఉన్నాడు. ఈ వివాదాల కారణంగానే ఆమె ప్రతిష్ఠను దిగజార్చేందుకు శ్రీపాదశర్మ ఇంట్లోని నగదును మూటలుగా చుట్టి, వీడియోతీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడని మున్సిపల్ సిబ్బంది అంటున్నారు. శ్రీపాదరావు రాష్ట్ర ఐటీశాఖ మంత్రి డీ శ్రీధర్‌బాబుకు దగ్గరి బంధువు అని స్థానిక ప్రజలు తెలిపారు. మంత్రి అండదండలతోనే శ్రీపాదశర్మ ఆమెను వేధిస్తున్నాడని అన్నారు. అతడు నిరుద్యోగి అని, ఆమె సంపాదిస్తుంటే ఇంట్లో ఉంటూ వేధింపులకు గురిచేస్తున్నాడని తెలిసింది.