హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): తన పేరుతో కొందరు అక్రమార్కులు మైక్రోఫైనాన్స్ అంటూ డబ్బులు వసూలు చేస్తున్నారని, అలా వస్తున్న వార్తలకు తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రముఖ సింగర్ మంగ్లీ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అలా ఎవరైనా మోసపోయి ఉంటే వారికి పోలీస్‌శాఖ న్యాయం చేయాలని కోరారు. నా ప్రొఫెషనల్ ఈవెంట్స్ కోసం నన్ను, నా తమ్ముడిని రోజూ చాలా మంది సంప్రదిస్తుంటారని తెలిపారు.
అంతేకానీ వాళ్ల వ్యక్తిగత వ్యాపారాలపై నాకు, నా కుటుంబ సభ్యలకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇలాంటి మోసపూరిత విషయాల్లోకి నా పేరును లాగడం అన్యాయమని పేర్కొన్నారు. కావాలని కొందరు నా వ్యక్తిగత పేరు, ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దయచేసి ఎవరూ నమ్మవద్దు’ అంటూ ఆమె ప్రకటనలో విజ్ఞప్తిచేశారు.