హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): ధర్మపురి, జగిత్యాల పట్టణాలను మరింత అభివృద్ధి చేయనున్నట్టు ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలో రెండు పట్టణాల సుందరీకరణ ప్రతిపాదిత డిజైన్లను మంత్రి పరిశీలించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ధర్మపురిలోని గోదావరి ఒడ్డున మంగళ్ఘాట్ పేరుతో 5 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతామని తెలిపారు. ఎంట్రీ గేట్, ఫౌంటెయిన్లు, చిల్డ్రన్ ప్లే ఏరియా, గ్రీనరీ, ల్యాండ్ సేపింగ్ పనులు చేపట్టనున్నట్టు వివరించారు. పట్టణంలోని చింతామణి, తమ్మళ్లకుంట చెరువు పరిసరాలు, వల్లభాయ్ పటేల్, గాంధీ జంక్షన్లను రూ.2.20 కోట్లతో సుందరీకరిస్తామని చెప్పారు. జగిత్యాల కొత్త బస్టాండు, పాత బస్టాండు, జయశంకర్ విగ్రహం చౌరస్తాలను సుందరీకరిస్తామని వెల్లడించారు.