ఖైరతాబాద్, అక్టోబర్ 17: ‘ఆగస్టు 1న అసెంబ్లీ సాక్షిగా దేశంలోనే మొదటిసారి తానే వర్గీకరణ ప్రారంభిస్తానని చెప్పాడు. రెండు నెలలు గడుస్తున్నయి. కమిటీలు, కమిషన్ల పేరుతో కాలయాపన చేస్తున్నడు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాదిగలను నమ్మించి మోసం చేసిండు’ అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం వైఖరిని తీవ్రంగా ఖండించారు. పంజాబ్, తమిళనాడు రాష్ర్టాలు వర్గీకరణను అమలుచేసి దేశంలోనే ఆదర్శంగా నిలిచాయని చెప్పారు.
కానీ దేశంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసే తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని, గతంలో ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణను అమలు చేస్తామని, అందుకు ఆర్డినెన్స్ తీసుకువస్తామని చెప్పిన రేవంత్ మాత్రం మాట తప్పారని మండిపడ్డారు. సీఎం మాటలకు ఏమాత్రం విలువలేకుండా పోయిందన్నారు. నమ్మించడంలో.. మోసం చేయడంలో రేవంత్‌రెడ్డి ఘనుడేనని అర్థమైందని, తేనె పూసిన కత్తిలా మాట్లాడి ముంచేశాడని విమర్శించారు. రేవంత్ సర్కారు 11 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి, అందులో వర్గీకరణ అమలు చేయకుండా మాదిగ బిడ్డల పొట్టకొట్టారని ఆవేదన వ్యక్తంచేశారు.
గ్రూప్-1, గ్రూప్-2తోపాటు డిసెంబర్ నాటికి లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెబుతున్న ముఖ్యమంత్రి.. వర్గీకరణ లేకుండానే వాటిని పూర్తిచేసే పనిలో ఉన్నారని పేర్కొన్నారు. ఎఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాష్ట్ర క్యాబినెట్‌లోని మాల పెద్దల ఒత్తిడితో మంత్రివర్గ కమిటీ అని ఆ తర్వాత కమిషన్ పేర్లు చెప్పి మాదిగల పట్ల కుట్ర, వివక్షపూరిత రాజకీయాలకు తెరలేపారని విమర్శించారు. వర్గీకరణ చేయాలని మాదిగలు, వద్దని మాలలు కొట్లాడుకుంటుంటే లబ్ధిపొందాలన్నది కాంగ్రెస్ ప్రభుత్వ ఎత్తుగడ అని విమర్శించారు.
చేవెళ్ల డిక్లరేషన్‌పై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకడుగు వేసిందని, రిజర్వేషన్ ఫలాలు మాలమాదిగలకు అందకుండా చేయాలన్నది కుట్ర అని ఆరోపించారు. రేవంత్ సర్కారు చర్యలకు నిరసనగా, ఈ నెల 25 నుంచి ఉమ్మడి జిల్లాల్లో మాదిగల ధర్మయుద్ధ జిల్లా మహాసభలు నిర్వహించనున్నామని తెలిపారు. ఆ తరువాత నవంబర్ 4 నుంచి 14 వరకు 119 నియోజకవర్గాల్లో ధర్మయుద్ధ దీక్షలు, నవంబర్ 16 నుంచి డిసెంబర్ 20 వరకు ధర్మయుద్ధ రథయాత్రలు నిర్వహిస్తామని చెప్పారు. డిసెంబర్ 21న లక్షల మందితో హైదరాబాద్‌లో మహాప్రదర్శన నిర్వహిస్తామని స్పష్టం చేశారు.