రవీంద్రభారతి, అక్టోబర్ 8:(నమస్తే తెలంగాణ): ఎస్సీ వర్గీకరణను అమలు చేయని సీఎం రేవంత్‌రెడ్డి మాదిగల వ్యతిరేకిగా మారారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేయకుండా టీచర్ పోస్టులను ప్రభుత్వం ఎలా భర్తీ చేస్తుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
మాలలకు అనుకూలంగా ఉంటూనే మాదిగలను నట్టేట ముంచుతున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా ఎస్సీ వర్గీకరణ కచ్చితంగా అమలు చేసి తీరుతామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్.. ఆ దిశగా చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. రేవంత్‌రెడ్డి తీరును నిరసిస్తూ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, ధర్నాలు చేయాలని మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు.
ప్రతి జిల్లాలో అంబేద్కర్ విగ్రహాల నుంచి నల్లజెండాలతో ర్యాలీలుగా బయల్దేరి కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు ఇవ్వాలని సూచించారు. నేడు హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌లోని అంబేద్కర్ విగ్రహం నుంచి బషీర్‌బాగ్ బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహం వరకు నిరసన ప్రదర్శనలు చేపడుతామని చెప్పారు.
సీఎం పదవి పోతుందనే భయంతోనే రేవంత్‌రెడ్డి వర్గీకరణ చేయలేదని మందకృష్ణ మాదిగ విమర్శించారు. వర్గీకరణ చేస్తే మాల సామాజిక వర్గానికి చెందిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీడబ్ల్యూసీ సభ్యుడు కొప్పుల రాజు ఆగ్రహానికి గురై పదవి కోల్పోవాలా? అని రేవంత్‌రెడ్డి మాదిగ ఎమ్మెల్యేలతో అన్నారని, అవసరమైతే త్వరలో ఆ ఎమ్మెల్యేల పేర్లను బయటపెడతానని స్పష్టంచేశారు.
ఎస్సీ వర్గీకరణ చేయకుండానే 9న ఎల్బీ స్టేడియంలో టీచర్ ఉద్యోగాలకు నియామకపత్రాలు అందజేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి వైఖరి వల్ల మాదిగ టీచర్ అభ్యర్థులకు తీరని నష్టం జరిగిందని మందకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. మాదిగ కోటా నుంచి మంత్రి అయిన దామోదర రాజనరసింహను చూసి సిగ్గుపడుతున్నానని మందకృష్ణ వ్యా ఖ్యానించారు. మాదిగల ప్రయోజనా లు ముఖ్యం అనుకుంటే వర్గీకరణ చేసేవరకు ఉద్యోగ నియమాకాలు ఆపించాలని డిమాండ్ చేశారు. అనుబంధ సం ఘాలతో ఈ నెల 15న సమావేశమై, ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని, ఇందుకు జరిగే పరిణామాలకు కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్ర అధ్యక్షుడు నరేశ్, శ్యాంసన్, సోమశేఖర్, కార్తీక్, అరుణ్‌కుమార్ పాల్గొన్నారు.