మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట రేంజ్ పరిధి దమ్మన్నపేట, మామిడిగూడెంలో ఆదివాసీలు, అటవీ అధికారుల మధ్య శనివారం ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. తమపై దాడి చేశారని అటవీ అధికారులు చేసిన ఫిర్యాదు మేరకు వాహనాల్లో వందలాది మంది అటవీ అధికారులు, పోలీసులు చేరుకొని 13 మంది ఆదివాసీ మహిళలను అదుపులోకి తీసుకున్నారు. 2004 కంటే ముందు నుంచే తాము భూములు సాగు చేసుకుంటూ బతుకుతున్నామని, శుక్రవారం తాము వాగుల్లో స్నానం చేస్తుంటే అటవీ అధికారులు వచ్చి ఇబ్బంది పెట్టడం వల్లే ఎదురు తిరిగామని ఆదివాసీ మహిళలు చెప్తున్నారు.
దండేపల్లి, సెప్టెంబర్13: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో అటవీ అధికారుల ఫిర్యాదు మేరకు 13 మంది ఆదివాసీ మహిళలను పోలీసులు అరెస్టు చేసినట్టు ఎస్ఐ తహసినొద్దీన్ తెలిపారు. వివరాల్లోకి వెళితే.. తాళ్లపేట రేంజ్ పరిధి లింగాపూర్ బీట్ 380 కంపార్ట్మెంట్లో దమ్మన్నపేట, మామిడిగూడెంలకు చెందిన ఆదివాసీలు పోడు వ్యవసాయం చేసుకుంటూ నివాసాలు ఏర్పర్చుకున్నారు. శుక్రవారం అక్కడికి చేరుకున్న ఫారెస్టు అధికారులు ఇది అటవీప్రాంతమని, ఖాళీ చేయాలని చెప్పడంతో ఆదివాసీలకు, ఫారెస్ట్ సిబ్బందికి మధ్య గొడవ జరిగింది. దీంతో తమపై ఆదివాసీ మహిళలు దాడిచేశారని అటవీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం ఉదయమే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి వందలాదిగా అటవీ అధికారులు, సిబ్బంది, పోలీసులు ఆదివాసీగూడేలకు చేరుకుని మహిళలను అరెస్టు చేశారు. మీడియాతో పాటు చేరుకున్న ఆదివాసీ సంఘ నాయకుడు మార్నేని భూమేశ్, మరికొంత మందిని ఫారెస్టు ఎంట్రెన్స్ వద్ద నిలిపివేశారు.
అటవీ అధికారుల తీరుపై ఆదివాసీ సంఘాల నాయకులు, మీడియా ప్రతినిధులు అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. అధికారులు, అటవీ సిబ్బంది వెళ్లిపోయిన తర్వాత అక్కడ చూస్తే పంటలు సాగు చేసిన ప్రదేశాల్లో జేసీబీలతో కందకాలు తవ్విన ఆనవాళ్లు కనిపించాయి. ఈ సందర్భంగా ఆదివాసీలు మాట్లాడుతూ 2004 కన్నా ముందు నుంచే ఈ భూములను సాగు చేసుకుంటున్నామని పేర్కొన్నారు.
అధికారులు ఎన్ని కేసులు పెట్టినా, ప్రాణాలు పోయినా భూములను వదిలేదని తేల్చిచెప్పారు. శుక్రవారం అటవీ అధికారులు తాము వాగుల్లో స్నానం చేస్తుంటే వచ్చి ఇబ్బందికి గురిచేయడంతోనే దాడి చేశామని వివరించారు. మీడియాను ఎందుకు అనుమతించలేదని ఎఫ్‌డీవో రామ్మోహన్‌ను వివరణ కోరగా ఏదైనా ఉంటే ప్రెస్‌నోట్ విడుదల చేస్తామంటూ సమాధానం దాటవేశారు. పోడు భూముల పేరిట చెట్లు నరికినా, వన్య ప్రాణులకు హాని కలిగించినా చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు.