హిమాయత్‌నగర్, నవంబర్ 7: మంచిర్యాల కాంగ్రెస్ అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు పెద్ద మోసగాడని హైదరాబాద్‌లోని కృష్ణానగర్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉపాధ్యక్షుడు వీ సత్యనారాయణ ఆరోపించారు. నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి తమ ప్లాట్లను ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్న ప్రేమ్‌సాగర్‌రావుపై కాంగ్రెస్ అధిష్ఠానం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంగళవారం హైదర్‌గూడలోని ఎన్ఎస్ఎస్లో మీడియాతో మాట్లాడుతూ.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాప్రా మండలంలోని వంపుగూడలోని 639, 643, 644, 647, 648, 654 సర్వేనంబర్లలో ఉన్న భూములను 1983 నుంచి 2000 వరకు పట్టాదారుల నుంచి 706 ప్లాట్లను కొనుగోలు చేసినట్టు తెలిపారు.
2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రేమ్‌సాగర్ తమ ప్లాట్లపై కన్నేసి ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. రాజకీయ పలుకుబడితో తమను ఆయన బావమరిది సత్యనారాయణరావు, అనుచరులతో కలిసి వేధించడంతోపాటు దాడులకు పాల్పడుతున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులు తమ ప్లాట్ల భూములను సర్వే చేసి తమ భూములుగా తేల్చడంతో అక్కడ తాము ఇండ్ల నిర్మాణాలను చేపడితే ప్రేమ్‌సాగర్ కూల్చివేయిస్తున్నాడని విమర్శించారు. తమకు న్యాయం చేసి భూములు దక్కేలా చూడాలని కోరారు. సమావేశంలో సొసైటీ నాయకులు వెంకట్‌రెడ్డి, భువనేశ్వర్‌రెడ్డి, పరశురాం, సాల్మన్, లక్ష్మి, సువర్ణ పాల్గొన్నారు.