మంచిర్యాల : ఊరు బాగుంటేనే దేశం బాగుంటుంది. ఊరు బాగుండాలంటే క్షేత్రస్థాయిలో పరిపాలన అభివృద్ధి పథంలో సాగాలి. అందులో పంచాయతీ కార్యదర్శులది ముఖ్యపాత్ర. ఒక్క మాటలో చెప్పాలంటే జిల్లాకు కలెక్టర్ ఎలాగో, గ్రామానికి పంచాయతీ కార్యదర్శి అలా. అంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ పదవిలో అధికారులకు నైపుణ్యాలు ఉన్నాయా? ఉంటే ఏ స్థాయిలో ఉన్నాయి? వారి పాలన విధులు ఏమిటి? అన్న విషయాలు తెలుసుకునేందుకు మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ రాహుల్ వినూత్న ప్రయత్నం చేశారు. జిల్లావ్యాప్తంగా ఉన్న పంచాయతీ కార్యదర్శులకు ఆన్లైన్ క్విజ్ నిర్వహించారు. ఏదో క్విజ్‌లో పాల్గొన్నారా? అయిపోయిందా? అన్నట్టు కాకుండా, వారి నైపుణ్యాలను బట్టి వీలైతే శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఈ క్విజ్ చేపట్టారు.
నిరంతర విధులు సహా పంచాయతీ రాజ్ చట్టంపై మొత్తం 25 ప్రశ్నలను తానే స్వయంగా రూపొందించారు. 20 నిమిషాల సమయం ఇచ్చి వారి నైపుణ్యాన్ని తెలుసుకొనే ప్రయత్నం చేశారు. పంచాయతీ కార్యదర్శులకు ఇలాంటి క్విజ్ నిర్వహించటం తెలంగాణలోనే తొలిసారి. ఇలాంటి క్విజ్ నిర్వహించిన తొలి జిల్లాగా మంచిర్యాల రికార్డు సృష్టించింది. పంచాయతీ కార్యదర్శుల్లో నైపుణ్యాన్ని పెంచే దిశగా వినూత్నంగా ఆలోచించిన అడిషనల్ కలెక్టర్ నిర్ణయం పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.