RTC Cargo | బంగారు పళ్లెంలో అడుక్కు తిన్నట్టు ఉన్నది ఆర్టీసీ యాజమాన్యం తీరు! ఏటా రూ.100 నుంచి రూ.120 కోట్లకు పైగా ఆదాయాన్నిచ్చే బంగారు బాతులాంటి కార్గోను, నెలకు రూ.3 కోట్లకు అంటే ఏడాదికి రూ.36 కోట్లకు ఓ ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టింది. దీని వెనుక ఇద్దరు మంత్రుల స్వప్రయోజనాలు దాగి ఉన్నట్టు తెలిసింది.
కరీంనగర్, జూన్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆర్టీసీ కార్గోను 10 నుంచి 15 ఏండ్లపాటు ప్రైవేట్ సంస్థకు అప్పగించేందుకు యాజమాన్యం గుట్టుచప్పుడు కాకుండా రెండు రోజుల క్రితమే ఒప్పందం చేసుకున్నట్టు తెలిసింది. దీని వల్ల ఆర్టీసీ ఆదాయానికి ఏటా సుమారు రూ.75 కోట్లకు పైగా గండి పడనుండగా స్వప్రయోజనాల కోసం సంస్థ ప్రయోజనాలను పక్కన పెట్టిన ఒకరిద్దరు మంత్రులు ఇందులో కీలక చక్రం తిప్పినట్టు విశ్వసనీయంగా తెలిసింది. మరోవైపు ప్రైవేట్ సంస్థకు అప్పగించడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 500 మంది లైసెన్స్ హమాలీ కూలీల బతుకులు ఆగమయ్యే ముప్పు పొంచిఉన్నది. గతంలో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్న కార్గోను 2020లో కేసీఆర్ ఆర్టీసీకి అప్పగించిన క్షణం నుంచి నేటి వరకు దినదినం లాభాల బాటన నడువగా, ఇప్పుడు కొన్ని శక్తుల కోసం కార్గోను తిరిగి ప్రైవేట్ సంస్థకు కాంగ్రెస్ సర్కార్ అప్పగించిన తీరుపై ఆర్టీసీ కార్మికుల్లోనూ ఆందోళన వ్యక్తమవుత్నున్నది. కాగా ఇప్పటికే ఈ బ్రాంచీలు నడుపుతున్న కొంతమంది ప్రైవేట్ ఏజెంట్లు ఆర్టీసీ నిర్ణయంపై కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.
నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి ఊతమిచ్చేందుకు అనేక చర్యలు చేపట్టిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్.. 2020లో కార్గో సేవలకు శ్రీకారం చుట్టారు. అప్పటి వరకు ఈ సేవలను ఏఎన్ఎల్ పార్సిల్ పేరిట ఓ ప్రైవేట్ సంస్థ నిర్వహించేది. తద్వారా ఆర్టీసీకి సమకూరుతున్న ఆదాయం, ఏర్పడుతున్న ఇబ్బందులు, సంస్థ నష్టపోతున్న తీరును నిశితంగా అధ్యయనం చేసిన బీఆర్ఎస్ సర్కార్, అప్పటి ప్రైవేట్ ఏజెన్సీని రద్దు చేసి ఆర్టీసీయే స్వయంగా నిర్వహించుకునేలా ఏర్పాట్లు చేసింది.
ఆర్టీసీ పార్సిల్, కొరియర్, కార్గో సేవలపై వినియోగదారుల్లో నమ్మకం కలిగేలా అన్ని రకాల చర్యలు తీసుకున్నది. 2020 జూన్ 19న అధికారికంగా కార్గో సేవలను ప్రారంభించగా అనతి కాలంలోనే అంచనాలకు మించి ఆదాయం పెరుగుతూ వచ్చింది. ఇందుకోసం ప్రారంభ దశలో ఆర్టీసీ సుమారు 50 బస్సులను కార్గో కోసం వినియోగించి.. దశలవారీగా పెంచుతూ వచ్చింది. మొదటి ఏడాది రూ.50 నుంచి రూ. 55 కోట్ల వరకు ఆదాయం రాగా, క్రమేపీ విస్తరిస్తూ రావడం వల్ల ప్రస్తుతం ఏడాదికి రూ.100 నుంచి రూ.120 కోట్లకు పెరిగినట్టు ఆర్టీసీ గణంకాలు చెప్తున్నాయి. అంటే ప్రతినెలా రూ.9 నుంచి రూ.10 కోట్ల మధ్య ఆదాయం ఆర్టీసీకి కార్గో ద్వారా సమకూరుతున్నది. ఇప్పడు కార్గో ప్రైవేట్ కొరియర్ సంస్థలను తలదన్ని ప్రథమ స్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు 24 గంటల్లో పార్సిల్ చేరవేసే స్థాయికి సౌకర్యాలను విస్తరించింది. ప్రస్తుతం తెలంగాణ, ఏపీతోపాటు వివిధ రాష్ర్టాలకు కార్గో సేవలు విస్తరించాయి. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా 425 బ్రాంచీల ద్వారా ఆర్టీసీ కార్గో సేవలు అందిస్తూ వినియోగదారుల మెప్పు పొందుతున్నది.
బంగారు బాతులాంటి కార్గోను విస్తరించి, మరింత బలోపేతం చేయాల్సిన ఆర్టీసీ యాజమాన్యం, రేవంత్ సర్కార్ అందుకు విరుద్ధమైన చర్యలు తీసుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఏటా రూ.100 నుంచి రూ.120 కోట్ల వరకు ఆదాయం వచ్చే సంస్థను కేవలం రూ.36 కోట్లకు కట్టబెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కార్గో ద్వారా ఆర్టీసీకి సమకూరుతున్న ఆదాయంపై ఒకరిద్దరు మంత్రులు కన్నేసినట్టు కార్మికవర్గాల ద్వారా తెలిసింది. అందుకే వ్యూహాత్మకంగా ఆర్టీసీ యాజమాన్యాన్ని ముందు పెట్టి, వెనుక ఉండి కథ నడిపినట్టు విశ్వసనీయ సమాచారం. ఆర్టీసీ కార్గో సేవలను ప్రైవేట్‌కు ఆప్పగించాలని భావించిన తర్వాత వ్యూహాత్మక ప్రక్రియ చేపట్టారు. గత ఆగస్టులో టెండర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. సదరు మంత్రులు తాము అనుకున్న సంస్థకు టెండర్ దక్కేలా ఆర్టీసీ యాజమాన్యంతో కొన్ని నిబంధనలు రూపొందించినట్టు తెలిసింది.
వారు కట్టబెట్టాలనుకునే సంస్థ ఒక్కటే టెండర్ వేస్తే అనుమానాలు వస్తాయని భావించి, వారు చెప్తే వినే సంస్థలు కూడా టెండర్ వేసేలా నిరుడే చర్యలు తీసుకున్నట్టు సమాచారం. ఆ మేరకు ‘ఓ ప్రైవేట్ లిమిటెడ్’ ఈ టెండర్‌ను దక్కించుకున్నట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే ఈ విషయం బయటకు పొక్కడంతో అప్పట్లో బీఆర్ఎస్ దీనిపై నిరసన వ్యక్తంచేసింది. లాభాల్లో నడుస్తున్న కార్గోను ప్రైవేట్‌కు ఎలా అప్పగిస్తారంటూ ప్రశ్నించింది. ఇది రచ్చరచ్చ కావడంతో అప్పట్లో ఒప్పందాలు చేసుకోలేదు. ఇప్పుడు మళ్లీ ఆ మంత్రులే చక్రం తిప్పినట్టు సమాచారం. మళ్లీ ఫైలు తెరపైకి వచ్చి ‘అవేజీ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థకు కార్గోను కట్టబెట్టినట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. నెలకు రూ.3 కోట్ల చొప్పున డబ్బులు చెల్లించేందుకు సదరు సంస్థ ఒప్పుకొన్నట్టు తెలుస్తున్నది. ఆ మేరకు ఆర్టీసీ యాజమాన్యం ఏకంగా 10 నుంచి 15 ఏండ్ల వరకు కాంట్రాక్టు అమల్లో ఉండేలా ఒప్పందం చేసుకున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని గుట్టుచప్పుడు కాకుండా రెండు రోజుల క్రితమే పూర్తి చేసినట్టు తెలిసింది.
ఆరేండ్లుగా కార్గో సేవలను ఆర్టీసీ విస్తరిస్తూ వచ్చింది. మంరింత బలోపేతం చేస్తే ప్రస్తుతం వస్తున్న ఆదాయాన్ని ఏడాదికి మరో రూ.50 కోట్ల మేరకు పెంచవచ్చన్న అభిప్రాయాలున్నాయి. కానీ, అలా చేయకుండా ఏకంగా నెలకు రూ.3 కోట్లకే ప్రైవేట్ సంస్థకు అప్పగించడంతో పాటు ఇన్నేండ్లపాటు కార్గోలో పనిచేసిన సిబ్బందిని తట్టాబుట్టా సర్దుకొమ్మని సోమవారం సాయంత్రం ఆర్టీసీ యాజమాన్యం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు సిబ్బంది ద్వారా తెలిసింది. కార్గోకు సంబంధించి పెండింగ్‌లో ఏమైనా పనులుంటే పూర్తి చేయాలని, ఆగస్టు ఒకటి నుంచి ప్రైవేట్ ఏజెన్సీ చేతుల్లోకి వెళ్తుందని సిబ్బందికి అధికారులు తేల్చిచెప్పారు. ప్రస్తుతం 425 బ్రాంచీల ద్వారా సేవలందిస్తుండగా, వాటిలో 26 బ్రాంచీలను ఆర్టీసీయే స్వయంగా నడుపుతున్నది. జుబ్లీ బస్‌స్టేషన్‌తోపాటు ఇమ్లిబన్, కరీంనగర్ లాంటి మేజర్ ఆదాయం వచ్చే బస్స్టేషన్లలో ఆర్టీసీయే తన సిబ్బందిని పెట్టి కార్గో సేవలు అందిస్తున్నది. మిగిలిన బ్రాంచీలను ప్రైవేట్ వ్యక్తులు నడుపుతున్నారు. వీరికి కమీషన్ ఆర్టీసీయే చెల్లిస్తున్నది. వీరికి మరో రెండేండ్ల పాటు కాంట్రాక్టు గడువు ఉన్నట్టు సమాచారం. గడువు ఇంకా ఉన్నా తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఉన్నపళంగా కార్గో సేవలను ప్రైవేట్ సంస్థకు అప్పగించడాన్ని సవాల్ చేస్తూ కొందరు కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇన్నాడ్లూ ఆర్టీసీ కార్గోను నమ్ముకొని ఉన్న సుమారు 500 మంది లైసెన్స్ హమాలీ కూలీల బతుకులు ఆగం కానున్నాయి. వీరికి 25 కిలోల బరువు ఎత్తి బస్సులో వేసినా, లేదా దింపినా ఒక్కో దానికి రూ.25 చెల్లిస్తున్నారు. ప్రైవేట్‌కు వెళ్తే ఈ ఆదాయాన్ని కోల్పోయే ప్రమాదమున్నది.
నిజానికి ఆర్టీసీకి ఊతమిచ్చేందుకు నాడు కేసీఆర్ కార్గో సేవలను అమల్లోకి తెచ్చి లాభాల బాట పట్టించారు. నేటికీ అదే స్ఫూర్తితో సిబ్బంది ముందుకు వెళ్తున్నారు. అలాంటి కార్గోను నెలకు రూ.3 కోట్లకే ధారాదత్తం చేయడంపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో లోతైన విచారణ చేస్తే కుట్రలన్నీ బయటపడుతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం కాంట్రాక్టు కుదుర్చుకున్న ప్రైవేట్ ఏజెన్సీకి ఉన్న అనుభవం ఏమిటి? అది సదరు మంత్రుల కుటుంబాలకు చెందిందా? అందులో ఉన్నది ఎవరు? ఆ సంస్థ ఇప్పటివరకు ఇంత పెద్ద వ్యవహారాన్ని ఎప్పుడైనా నిర్వహించిందా? గత ఆగస్టులో జరిగిన టెండర్ ప్రకారం ఇప్పుడు ఎందుకు ఒప్పందం చేశారు? గతంలోనే విమర్శలు వచ్చినా ఆపకుండా తిరిగి అమల్లోకి తేవడంలో ఆర్టీసీ ఆంతర్యం ఏమిటి? దీని వెనుక ఎవరి ఒత్తిడి ఉన్నది? లాభా ల్లో ఉన్న కార్గోను ప్రైవేట్‌కు ఎందుకు అప్పగిస్తున్నారు? అన్న కోణాల్లో విచారిస్తే అక్రమాలు బయటకొస్తాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
రోడ్డున పడనున్న హమాలీలు 500కు పైగా..