Project work | హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): గడిచిన కాలంలో మానవుడి చర్యల అధ్యయనమే చరిత్ర. మానవుడి పుట్టుక, కాల గమనంపై ఇప్పటికీ ఎన్నో రకాల కొత్త విషయాలు నేటికి బయటపడుతున్నాయి. అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఈ క్రమంలో గ్రామాల చరిత్రను లిఖించే సరికొత్త యజ్ఞం రాష్ట్రంలో ప్రారంభమైంది. ఎవరి గ్రామ చరిత్రను వారే రాసుకునే సరికొత్త ప్రయత్నం విజయవంతంగా నడుస్తున్నది. ఇప్పటివరకు వెయ్యి గ్రామాల చరిత్రను అక్షరబద్ధం చేశారు. త్వరలోనే మరో రెండు 200కు పైగా గ్రామాల చరిత్రను భవిష్యత్తు తరాలకు అందించనున్నారు. గ్రామాల చరిత్రను లిఖించడంలో భాగంగా తెలంగాణ సాహిత్య అకాడమీ, కళాశాల విద్యాశాఖ సంయుక్తంగా ‘మన ఊరు-మన చరిత్ర’ పేరుతో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. డిగ్రీ ఫైనలియర్ విద్యార్థులకు ప్రాజెక్ట్ వర్క్‌లో భాగంగా తమ సొంతూరి చరిత్రను తామే రాసే అవకాశం కల్పించారు. వేసవి సెలవుల్లో ఈ ప్రాజెక్ట్ వర్క్‌ను పూర్తిచేసేలా ఆదేశాలిచ్చారు. ఇటీవలే ఈ కార్యక్రమంపై అధికారులు సమీక్షించగా, వెయ్యి నుంచి 1200 గ్రామాల చరిత్రను విద్యార్థులు రాసినట్టు గుర్తించారు. ఆయా చరిత్రను పుస్తక భాషలోకి మార్చి, సమగ్రంగా క్రోడీకరించి, పుస్తకంగా తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ నెలాఖరు వరకు ప్రాజెక్ట్ వర్క్‌ను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంతో అనేక కొత్త విషయాలు, వెలుగులోకి రానివి బయటపడ్డాయి. ఆహారపు అలవాట్లు, వస్తుసామగ్రి, సంప్రదాయాలు వెలుగులోకి వచ్చాయి.