హైదరాబాద్ : ప్రభుత్వ బడుల రూపురేఖలను మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు మన బడి – మన బస్తీ మన బడి’లో తీర్చిదిద్దిన బడుల ప్రారంభోత్సవ ముహుర్తాన్ని ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ నెల 30న బడులను ప్రారంభించాలని నిర్ణయించింది. 1,200 వరకు బడులు సిద్ధం కాగా, వీటిని ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నది. జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొని ఎక్కడిక్కడ బడుల ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. ప్రాథమిక సమాచారం మేరకు సిద్ధమైన 1,200 బడులకుపైగా ఒకేరోజు సగానికి పైగా బడులను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో సర్కారు బడుల రూపురేఖలను సమగ్రంగా మార్చేందుకు ‘మన ఊరు మన బడి – మన బస్తీ మన బడి’ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. గ్రామాల్లో మన ఊరు మన బడి – పట్టణాల్లో మన బస్తీ మన బడి పేరుతో కార్యక్రమాన్ని అమలుచేస్తున్నారు. కార్యక్రమానికి 2022 మార్చి 8న సీఎం కేసీఆర్ వనపర్తిలో శ్రీకారం చుట్టారు. మొదటి విడుతలో రూ.3,497.62 కోట్లను వెచ్చించి, 9,123 బడులను సమగ్రంగా మార్చే పనులను ప్రారంభించారు. 12 అంశాలను తీసుకుని స్కూళ్ల స్వరూపాన్ని మార్చేందుకు అంకురార్పణ చేశారు. వీటిలో ఇప్పటి వరకు 1, 240 వరకు బడులు సిద్ధం కాగా, ఈ నెల 30న ప్రారంభోత్సవాల పండుగను జరుపుతారు.