నార్నూర్, సెప్టెంబర్ 4: ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ (Narnoor) మండలం మల్లంగిలో విషాదం చోటుచేసుకున్నది. వరదలో చిక్కుకుపోయిన ముగ్గురిని కాపాడిన ఓ వ్యక్తి తాను ప్రాణాలు వదిలాడు. బుధవారం మల్లంగికి చెందిన జాదవ్ కృష్ణ, జాదవ్ మిథున్, జాదవ్ మిట్టు వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లారు. సాయంత్రం తిరిగి ఇంటికి వస్తుండగా భారీ వర్షానికి గ్రామంలోని పెద్ద వాగు ఉప్పొంగింది. దీంతో ముగ్గురు వరదలో చిక్కుకుపోయారు. అటుగా వస్తున్న జాడే శంకర్ (36) వారిని వాగులో నుంచి బయటకు చేరవేశారు. ఈ క్రమంలో వరద ఉధృతి పెరగడంతో ఆయన కొట్టుకుపోయి మరణించారు.
సమాచారం అందుకున్న నార్నూర్ ఎస్ఐ, తాసిల్దార్ జాడి రాజలింగం ఘటనా స్థలానికి చేరుకొని మృతికి గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉట్నూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. గురువారం గురువారం అంతక్రియలు నిర్వహించారు. బాధితుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ముగ్గురి ప్రాణాలు కాపాడిన శంకర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరారు.