జగిత్యాల రూరల్, జనవరి 12: బతికుండగానే ఓ వ్యక్తి సమాధిని నిర్మించుకోగా, తాజాగా అతడు మృతచెందడంతో అందులోనే ఖననం చేసిన ఘటన జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. లక్ష్మీపూర్‌కు చెందిన నక్క ఇందయ్య (90) అలియాస్ జాన్‌కు భార్య, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఇందయ్య చిన్నవయసులోనే ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. అక్కడ కార్మికుడిగా పనిచేస్తూ సొంతంగా కంపెనీ స్థాపించి, ఎంతో మందికి ఉపాధి కల్పించాడు. తిరిగి వచ్చిన ఇందయ్య గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు చేశాడు.
గ్రామ శివారులోని తన వ్యవసాయ భూమిలో 2009లో తన చివరి మజీలిని నిర్మించుకున్నాడు. అందులోనే తన భార్య, తన మృతదేహాలను ఖననం చేయాలని తన సంతానానికి సూచించాడు. కొద్దిరోజుల క్రితం భార్య మృతి చెందగా, తాను నిర్మించిన సమాధిలోనే ఖననం చేశాడు. వారంరోజులుగా అనారోగ్యంతో కరీంనగర్‌లోని దవాఖానలో చికిత్స పొందుతూ ఇందయ్య శనివారం మృతిచెందగా, కుటుంబసభ్యులు అతడి మృతదేహాన్ని ఇందయ్య నిర్మించుకున్న వాటికలో ఖననం చేశారు.