చేవెళ్ల రూరల్, అక్టోబర్ 8 : మొబైల్ ఫోన్ పాస్వర్డ్ చెప్పలేదన్న ఆగ్రహంతో ఓ వ్యక్తిని హత్యచేసిన ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఠాణా పరిధిలో కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. బుధవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో చేవెళ్ల బస్‌స్టాండ్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి (43) వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను కొందరు లాక్కున్నారు. చేవెళ్ల మున్సిపల్ కందవాడ వార్డు పరిధిలోని డంపింగ్ యార్డు షెడ్డులోకి తీసుకెళ్లి ఫోన్ లాక్ తీసేందుకు పాస్వర్డ్ చెప్పాలని ఒత్తిడి తెచ్చారు.
బాధితుడు ససేమిరా అనడంతో దుండగులు కర్రలతో తలపై కొట్టి దారుణంగా హత్యచేశారు. అనంతరం బాధితుడి ఫోన్‌ను డంపింగ్ యార్డులో మంటల్లో పడేశారు. గురువారం మధ్యాహ్నం ఓ నిందితుడు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి లొంగిపోయి హత్య వివరాలు వెల్లడించాడు. వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతుడి వివరాలు తెలియరాలేదని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.