ధర్మారం, జూలై 6: ఎస్సై వేధించాడనే కారణంతో పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మేడారం గ్రామానికి చెందిన కొండా రాములు (54) ఆదివారం మధ్యాహ్నం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. బాధితుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రాములు చిన్న కొడుకు సాగర్ను కొందరు వ్యక్తులు 2021 జూలై 7న హత్య చేయగా, ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన పోలవేణి రామయ్యతోపాటు అతని కుటుంబ సభ్యులైన 8 మందిపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. ఈ కేసు పెద్దపల్లి జిల్లా కోర్టులో విచారణలో ఉన్నది. ఈ కేసు విషయంలో రాములు రాజీపడితే నిందితుడు పోలవేణి రామయ్య రూ.22 లక్షల పరిహారం ఇస్తాడని ఆ గ్రామ పెద్ద మనుషులు ఒప్పందం కుదిర్చి మధ్యవర్తుల పేరిట బ్యాంకులో డబ్బులు జమచేశారు.
హత్యకు గురైన సాగర్ తల్లి మాత్రం తన కొడుకును పోలవేణి రామయ్య తరపు వ్యక్తులు హత్య చేశారని కోర్టులో సాక్ష్యం చెప్పింది. దీంతో సదరు వ్యక్తులు బ్యాంకులో జమచేసిన డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు. ఈ పంచాయితీ ఎస్సై లక్ష్మణ్ వరకు వెళ్లడంతో ఆయన రాములును బెదిరించినట్టు బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలోనే రాములు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించినట్టు వారు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన కరీంనగర్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. అయితే తాను రాములును బెదిరించలేదని ఎస్సై వివరణ ఇచ్చారు.