ఖిలావరంగల్, జూలై 25 : వరంగల్ జిల్లా మామునూరు ఎయిర్‌పోర్టు విస్తరణలో భాగంగా ఇండ్లు కోల్పోతున్న తమకు నష్ట పరిహారంపై స్పష్టత ఇవ్వకపోవడంతో బాధితులు అధికారులను ప్రశ్నించారు. ఖిలావరంగల్ మండలం గాడిపల్లిలో ఆర్అండ్ఆర్ చట్టంపై అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీవో సత్యపాల్‌రెడ్డి, ఖిలా వరంగల్ తహసీల్దార్ బండి నాగేశ్వర్రావు, కార్పొరేటర్ గద్దె బాబు ఆధ్వర్యంలో శుక్రవారం గ్రామసభ నిర్వహించగా, పరిహారంపై స్పష్టమైన హామీ ఇస్తేనే ఖాళీ చేస్తమని బాధితులు స్పష్టంచేశారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారంతో వేరే ప్రదేశంలో స్థలం కొనుగోలు చేసి ఇండ్లు నిర్మించుకోవడం సాధ్యపడదని చెప్పారు. గాడిపల్లిలో గజానికి రూ. 30 వేలు ఉందని, మార్కెట్ ధర ప్రకారం పరిహారం ఇస్తే ఇండ్లను ఖాళీ చేస్తమని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగావకాశాలు కల్పించాలని, లేదంటే వ్యవసాయం చేసుకునేందుకు మరో చోట ఎకరం భూమి కేటాయించాలని కోరారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ గ్రామంలో 20 కుటుంబాలు 12 ఇండ్లు కోల్పోతున్నాయని, ఆర్అండ్ఆర్ పథకంలో ఒక్కో ఇంటికి పరిహారం రూ. 7,86,000 ఇస్తామని చెప్పారు. జనరల్ అవార్డు తీసుకుంటే రూ. 11, 64,000 చెల్లిస్తామని, ఇంటితోపాటు స్థలం, ఖాళీ స్థలానికి త్వరలోనే నిబంధనల మేరకు ధర నిర్ణయిస్తామని వెల్లడించారు.
స్పష్టమైన హామీ ఇస్తేనే ఇండ్లు ఖాళీ చేస్తం
గాడిపల్లిలో గజానికి రూ.30 వేలు ఉంది. ప్రస్తుతం అధికారులు జనరల్ అవార్డు తీసుకుంటే రూ.11,64,000 చెల్లిస్తామని అంటున్నారు. ఇంటికి, ఇంటి స్థలానికి ధర నిర్ణయించలేదు. ప్రస్తుతం మార్కెట్ ధర ప్రకారం ప్రభుత్వం పరిహారం ఇస్తే ఇండ్లను ఖాళీ చేస్తం. జీవనోపాధి, ఇంటిని కోల్పోతున్నందున ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. లేదంటే వ్యవసాయం చేసుకునేందుకు మరో చోట ఎకరం భూమి కేటాయించాలి.
-విజయ్, గాడిపెల్లి
మామునూరు ఎయిర్‌పోర్టు భూసేకరణకు 205 కోట్లు విడుదల
హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): వరంగల్‌లోని మామునూరు ఎయిర్‌పోర్టు భూసేకరణకు ప్రభుత్వం రూ.205 కోట్లను విడుదల చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. మామునూరు వద్ద ఎయిర్‌పోర్టు నిర్మాణానికి పౌర విమానయాన శాఖ మార్చి నెలలో పచ్చజెండా ఊపింది. ఎయిర్‌పోర్టుకు అన్ని అనుమతులు ఇస్తూ నిర్మాణం ప్రారంభించేందుకు వీలుగా సంబంధిత దస్త్రంపై పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సంతకం చేశారు. దీంతో భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.