హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని (Telangana) చిన్నారుల్లో పోషకాహార లోపం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. రాష్ట్రంలోని ఐదేండ్లలోపు చిన్నారుల్లో 31.8% మంది పోషకాహార లోపంతో బాధ పడుతూ బరువు తక్కువగా ఉన్నట్టు మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ (MSPI) వెల్లడించింది. ఈ మేరకు సెంట్రల్ అండ్ స్టేట్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ కార్యక్రమంలో ‘చిల్డ్రన్ ఇన్ ఇండియా-2025’ పేరిట ఓ నివేదికను విడుదల చేసింది.
బాలికల కంటే బాలురలోనే అధికం
పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లోనే చిన్నారుల్లో పోషకాహార లోపం అధికంగా ఉన్నట్టు తాజా అధ్యయనం పేర్కొన్నది. గ్రామీణ ప్రాంతాల్లో 35%, పట్టణాల్లో 25.8% మంది చిన్నారులు పోషకాహార లోపంతో బాధ పడుతున్నట్టు వెల్లడించింది. బాలికల కంటే బాలురలోనే ఈ సమస్య అధికంగా ఉన్నట్టు పేర్కొంది. బాలురలో 33.4%, బాలికల్లో 30% మంది పోషకాహార లోపంతో బాధ పడుతున్నట్టు వివరించింది. మరోవైపు రాష్ట్రంలో కొంత మంది పిల్లలు ఒబెసిటీ (స్థూలకాయం)తో బాధ పడుతున్నారని, బాలురులో 3.0%, బాలికల్లో 3.8% మంది ఈ సమస్యతో సతమతమవుతున్నారని అధ్యయనం వెల్లడించింది. పట్టణాల్లోని చిన్నారుల్లో 4.2%, గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారుల్లో 3.0% మంది స్థూలకాయంతో బాధపడుతున్నట్టు తెలిపింది.
వెంటనే చర్యలు తీసుకోవాలి: నిపుణులు
చిన్నారులు ఎదుర్కొంటున్న మరిన్ని ఆరోగ్య సమస్యలను ఈ నివేదిక వెలుగులోకి తెచ్చింది. 5-9ఏండ్ల వయసున్న చిన్నారుల్లో 22.7% మందికి, 10-19 ఏండ్ల వయసు వారిలో 26.0% మందికి ఐరన్ లోపం ఉన్నట్టు వెల్లడించింది. ఐదేండ్లలోపు చిన్నారుల్లో 31.8 శాతం మంది బరువు తక్కువగా ఉన్నట్టు తెలిపింది. 10-19ఏండ్ల మధ్య వయస్కుల్లో 6.7% మంది అధిక రక్తపోటు (హైపర్టెన్సివ్)తో బాధ పడుతున్నారని, మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్లే ఇందుకు ప్రధాన కారణమని వివరించింది. పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపర్చేందుకు ఐరన్, విటమిన్ సప్లిమెంట్స్ ఇవ్వడంతోపాటు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచిస్తున్నారు.