హైదరాబాద్ సిటీ బ్యూరో, జనవరి 18 (నమస్తే తెలంగాణ): మార్ఫింగ్ ఫొటోలతో ప్రముఖులను అసభ్యకర రీతిలో చిత్రీకరించి, వీడియోలు తయారు చేయించిన వ్యవహారంలో తానే బాధ్యుడినని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లు రవి పోలీసుల విచారణలో వెల్లడించినట్టు తెలిసింది. దీంతో ఈ కేసులో ఆయనే ప్రధాన నిందితుడిగా మారే అవకాశమున్నట్టు సమాచారం. ప్రధాని, సీఎం, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, మహిళా ప్రజాప్రతినిధులకు చెందిన మార్ఫింగ్ వీడియోల వైరల్ వ్యవహారంపై హైదరాబాద్‌లో ఐదు కేసులు నమోదయ్యాయి.
హైదరాబాద్ సైబర్‌క్రైమ్ ఠాణాలో నమోదైన కేసులో పోలీసులు ఐపీ అడ్రస్‌ల ఆధారంగా ఓ కార్యాలయాన్ని గుర్తించారు. కాంగ్రెస్‌కు వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న సునీల్ కనుగోలు.. మాదాపూర్‌లో మైండ్షేర్ యునైటెడ్ ఫౌండేషన్ పేరుతో కార్యాలయంలో మార్ఫింగ్ వీడియోలు, ఫొటోలను సోషల్‌మీడియాలో సర్క్యూలేట్ చేస్తున్నట్టు గుర్తించారు. ఇందుకు కారకులైన ఉద్యోగులకు పోలీసులు 41 సీఆర్పీసీ నోటీసులు జారీచేశారు. సునీల్ కనుగోలును ప్రధాన నిందితుడిగా భావించి విచారణకు పిలిచారు. కాగా, వీటన్నింటికి తానే బాధ్యుడినంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మల్లు రవి సైబర్‌క్రైమ్ పోలీసులకు లేఖ రాశారు.
ఈ క్రమంలో ఈ నెల 9న సునీల్ కనుగోలు సైబర్‌క్రైమ్ పోలీసుల విచారణకు హాజరయ్యారు. తాను కాంగ్రెస్ టాస్క్‌ఫోర్స్ సభ్యుడినని, అంతా మల్లు రవి చెప్పినట్టు చేస్తామంటూ విచారణలో తెలిపారు. ఈ నేపథ్యంలో మల్లు రవికి సైబర్‌క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. బుధవారం మల్లు రవి విచారణకు హాజరవ్వగా, ఏసీపీ కేవీఎం ప్రసాద్ నేతృత్వంలో ఇన్స్పెక్టర్ పద్మ బృందం ఆయనను విచారించింది. ప్రతీ పోస్టును తాను చూడబోనని, కాన్సెప్ట్ ఇస్తామని.. వాటి ఆధారంగా సోషల్‌మీడియాకు కావాల్సిన వీడియోలు, ఫొటోలను తన సిబ్బంది మార్ఫింగ్ చేస్తారంటూ రవి విచారణలో వెల్లడించినట్టు తెలిసింది.
ఈ వ్యవహారంలో కీలక వ్యక్తి మల్లు రవినే అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కాగా, ఇప్పటివరకు నిందితుల జాబితాలో ఏ1గా సునీల్ కనుగోలు ఉండగా ఆ స్థానంలోకి మల్లు రవి వచ్చే అవకాశాలున్నట్టు తెలుస్తున్నది. కేసు దర్యాప్తులో వెల్లడవుతున్న అంశాలతో చార్జీషీట్ వేసే నాటికి నిందితుల స్థానాలలో మార్పులుచేర్పులు జరుగుతాయని సైబర్‌క్రైమ్స్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు.