హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): సివిల్ సర్వీసెస్ మెయిన్స్, ఇంటర్వ్యూలకు ఎంతమంది రాష్ట్రం నుంచి ఎంపికైనా ఆర్థిక సాయాన్ని అందజేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గురువారం ప్రజాభవన్‌లో మెయిన్స్‌కు ఎంపికైన 50మంది అభ్యర్థులకు రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం కింద రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెయిన్స్‌కు ఎంపికైతే లక్ష.. ఆ తర్వాత ఇంటర్వ్యూకు ఎంపికైతే లక్ష ఆర్థికసాయంతోపాటు, ఢిల్లీలో వసతి కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. మొదటిసారి 140మంది మెయిన్స్‌కు ఎంపిక కాగా, అందులో 20మంది ఇంటర్వ్యూకు ఎంపికయ్యారని, అందులో ఏడుగురు సివిల్ సర్వీసెస్‌కు ఎంపికకావడం గర్వంగా ఉన్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, సింగరేణి సంస్థ సీఎండీ ఎన్ బలరామ్, డైరెక్టర్ పర్సనల్ గౌతమ్ పొట్రు తదితరులు పాల్గొన్నారు.