హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Assembly Session) కొనసాగుతున్నాయి. విద్యుత్ రంగంపై ప్రభుత్వం స్వల్పకాలిక చర్చను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు. 30 పేజీల శ్వేతపత్రాన్ని సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని విద్యుత్ సరఫరా, ఉత్పత్తి గురించి తెలియజేయాలనే శ్వేతపత్రం విడుదల చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పురోగతిలో విద్యుత్ రంగం కీలకపాత్ర పోషిస్తుందన్నారు. పరిశ్రమల అభివృద్ధికి, వ్యవసాయ రంగం పురోగతికి నమ్మకమైన విద్యుత్ సరఫరానే వెన్నెముక అన్నారు. రవాణా, సమాచార రంగాలకు మనుగడకు విద్యుత్ సరఫరా చాలా ముఖ్యమని తెలిపారు. రాష్ట్ర ప్రజల నాణ్యమైన జీవనశైలి సూచించేది కూడా విద్యుతేనని చెప్పారు.