హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల ప్రజలకు మల్లోజుల మధురమ్మ పేరు పరిచయం అక్కర్లేదు. మావోయిస్టు పార్టీ అగ్ర నేతలైన కోటేశ్వరరావు, వేణుగోపాలరావులకు జన్మనిచ్చిన మధురమ్మ (100) ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించి మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచింది. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న సమయంలోనే మంగళవారం ఉదయం ఆమె గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆమె పరిస్థితి మరింత విషమించింది. ఈ క్రమంలో ఆమెను హైదరాబాద్ నుంచి పెద్దపల్లికి తీసుకువచ్చారు. పెద్దపల్లిలోని ఆమె నివాసంలో మంగళవారం సాయంత్రం తుది శ్వాస విడిచింది.