కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో కీలక ఘట్టానికి ముహూర్తం ఆసన్నమైంది! తెలంగాణ జలకిరీటంగా భాసిల్లే మల్లన్నసాగర్ రిజర్వాయర్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. కాళేశ్వరుడి పాదాలను అభిషేకించి.. రాజన్న జటాఝూటంనుంచి పరవళ్లు తొక్కి.. అన్నపూర్ణ ఒడిలో సేదదీరి.. రంగనాయకుడి చెంతకు చేరిన గంగమ్మ కొమురెల్లి మల్లన్నకు జలబోనాన్ని సమర్పించుకొనేందుకు ఉరకలెత్తి వచ్చింది. తెలంగాణ తల్లి జలకిరీటం ధరించింది. తెలంగాణ జల విధాత ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఈ నెల 23న మల్లన్న గంగ ఉప్పొంగనున్నది. కాళేశ్వరం ప్రాజెక్టులోని రిజర్వాయర్లన్నింటిలోనూ అతి పెద్దది.. అత్యంత ఎత్తున ఉన్నదీ ఇదే! డ్యామ్ ప్రొటోకాల్‌ను అనుసరించి ఇప్పటికే నీటి నిల్వ సామర్థ్య పరీక్షలు విజయవంతం కావడంతో మల్లన్నసాగర్ ప్రారంభానికి అధికారులు ఏర్పాట్లు చేశారు.
(మ్యాకం రవికుమార్ ):కాళేశ్వరం ప్రాజెక్టు లింక్-4లో భాగంగా రూ. 6,805కోట్ల బడ్జెట్‌తో, 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న మల్లన్నసాగర్ జలాశయం ప్రారంభానికి సిద్ధమైంది. ఈ నెల 23 ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఈ జలాశయాన్ని ప్రారంభించనున్నారు. 21వ తేదీన బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేయనున్నారు. మల్లన్నసాగర్ నిర్మాణంతో కాళేశ్వరం ప్రాజెక్టులో లింక్ 4 లో శ్రీరాజరాజేశ్వర జలాశయం నుంచి కొండ పోచమ్మసాగర్ వరకు పనులన్నీ పూర్తయినట్టే. మల్లన్నసాగర్ జలాశయ ప్రారంభానికి సంబంధించిన వివరాలను టీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మంగళవారం వెల్లడించారు. జలాశయ ప్రారంభానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామని, అనంతరం రిజర్వాయర్ దగ్గరే భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని పేర్కొన్నారు.
అతి పెద్ద ఆఫ్‌లైన్ ప్రాజెక్టు
కాళేశ్వరం ఎత్తపోతల ప్రాజెక్టులో మల్లన్నసాగర్ జలాశయమే అతిపెద్దది. అత్యంత కీలకమైంది కూడా. సిద్దిపేట జిల్లాలోని తొగుట-కొండపాక మండలాల శివారులో గుట్టల మధ్య దీని నిర్మాణం చేపట్టారు. వ్యవసాయ అవసరాలతోపాటు హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలకు తాగునీటి కోసం 30 టీఎంసీలు, పారిశ్రామిక అవసరాల కోసం 16 టీఎంసీల నీటిని ఈ రిజర్వాయర్ నుంచి ఏడాది పొడవునా అందిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని 12 నుంచి 19 ప్యాకేజీల ద్వారా సుమారు 8.33 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు దీని నుంచి నీటిని అందిస్తారు. మరో 7,37,250 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించనున్నారు. ఎస్ఆర్ఎస్పీ-స్టేజ్ 1, నిజాంసాగర్, సింగూరు ప్రాజెక్టుల కింద కొత్త, పాత ఆయకట్టు కలుపుకొని 15,71,050 ఎకరాలు ఈ రిజర్వాయర్ కిందికి రానున్నాయి. రిజర్వాయర్ వైశాల్యం 17,600 ఎకరాలు కాగా, 10.5 కిలోమీటర్ల పొడవున్న గుట్టలను ఇరువైపులా కలుపుతూ 22.6 కిలోమీటర్ల కట్టను నిర్మించారు. 10 టీఎంసీలకు ఒక అంచె చొప్పున ఐదు అంచెల్లో దీన్ని కట్టారు. 143 మీటర్ల పొడవుతో మత్తడిని ఏర్పాటుచేశారు. తుక్కాపూర్ పంప్‌హౌస్ నుంచి మల్లన్నసాగర్‌కు జలాశయానికి నీటిని తరలిస్తారు.
తొలివిడతగా 10 టీఎంసీలు..
అతిపెద్ద ఆఫ్‌లైన్ ప్రాజెక్టు కావడంతో డ్యామ్ ప్రొటోకాల్ ఒకేసారి పూర్తిస్థాయి నిల్వమట్టంతో నింపకుండా విడతలవారీగా క్రమపద్ధతిలో ఒక్కోస్థాయి వరకు నీటిని నింపుతూ వచ్చారు. ప్రస్తుతం రిజర్వాయర్‌లోకి 10 టీఎంసీలను తరలించారు. 60 మీటర్ల ఎత్తయిన మట్టికట్ట ఏ మేరకు పనిచేస్తున్నదో పరీక్షలు నిర్వహించారు. ఐఐటీ హైదరాబాద్, ఓయూ ప్రొఫెసర్ల ఎక్స్పర్ట్ కమిటీతో, విశ్రాంత ఇంజినీరింగ్ అధికారులతో అధ్యయనం చేయించారు. నిర్మాణ నాణ్యత, ఇనుప ఫిల్లర్లు, మెటల్ ఫిల్లర్లు, రాతి కట్టడాలు, డ్రైయిన్ సిస్టమ్‌ను అధ్యయనం చేసి ధ్రువీకరించడంతో జలాశయాన్ని ప్రారంభించడానికి అధికారులు సిద్ధం చేశారు.
కాళేశ్వరం లింక్-4 సంపూర్ణం
మల్లన్నసాగర్ నిర్మాణంతో కాళేశ్వరం ప్రాజెక్టులో లింక్ 4 లో శ్రీరాజరాజేశ్వర జలాశయం నుంచి కొండ పోచమ్మసాగర్ వరకు పనులన్నీ పూర్తయినట్టే. 5,89,280 ఎకరాలకు సాగునీరు అందించడంలో భాగంగా అన్నపూర్ణ (3.5 టీఎంసీలు), రంగనాయకసాగర్ (3 టీఎంసీలు), మల్లన్నసాగర్ (50 టీఎంసీలు), కొండపోచమ్మ సాగర్ (15 టీఎంసీలు) జలాశయాలను 71.5 టీఎంసీల నీటి నిల్వ కోసం నిర్మించారు. మల్లన్నసాగర్ నుంచి కొండపోచమ్మసాగర్‌కు జలాలను తరలించాల్సి ఉన్నప్పటికీ రిజర్వాయర్ పూర్తికాలేదు. దీనితో రైతుల ప్రయోజనాలకోసం 18.5 కిలోమీటర్ల ఫీడర్ చానెల్ నిర్మించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఆ ఫీడర్ చానల్ ద్వారా గత ఫిబ్రవరిలోనే కొండపోచమ్మ సాగర్‌కు గోదావరి జలాలను తరలించారు. ప్రస్తుతం మల్లన్నసాగర్ అందుబాటులోకి రావడంతో మొత్తంగా లింక్ 4లోని 12 నుంచి 19 ప్యాకేజీలకు సంబంధించిన పనులన్నీ పూర్తయినట్టే.
ఇవీ మల్లన్నసాగర్ ప్రత్యేకతలు
సింగూరుకు పూర్వవైభవం..
సింగూరు ప్రాజెక్టుకు పూర్వవైభవం రానున్నది. ఎగువన ఉన్న బీడు భూములను సస్యశ్యామం చేయబోయే పథకాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో మోక్షం లభించింది. రూ.4,427 కోట్లతో చేపట్టనున్న బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలకు ఈ నెల 21న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ పథకాలు పూర్తయితే సంగారెడ్డి, అందోల్, జహీరాబాద్, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో 4.56 లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నది. హైదరాబాద్ తాగునీటి అవసరాలు కూడా తీరుతాయి.
మల్లన్నసాగర్ ప్రత్యేకతలు