Aasara Pension | కవాడిగూడ, మే 17: ‘అయ్యా కేసీఆర్ బాగున్నడా.. ఆ సారున్నప్పుడే మాబోటోళ్లకు బాగుండె.. పింఛన్ టైంకిచ్చిండు.. ఇప్పుడు రెండు, మూడు నెలలైనా వస్తలేదు.. ఆఫీసర్లు పట్టించుకుంటలేరు’ అని హైదరాబాద్ బొంతలబస్తీకి చెందిన మందరి మల్లమ్మ అనే అవ్వ ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఎదుట తన ఆవేదనను వెళ్లబోసుకున్నది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బాగు కోరుకున్నది. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే ‘అవ్వా నువ్వు బాధపడకు నేను తహసీల్దార్‌తో మాట్లాడి పింఛన్ మంజూరు చేయిస్తా’ అని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని బోలక్పూర్ డివిజన్ అధ్యక్షుడు వై శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శనివారం ఎమ్మెల్యే ముఠా గోపాల్ వాటర్‌వర్క్స్, మున్సిపల్ అధికారులతో కలిసి రంగానగర్, పాడిమసీద్, గుల్షన్‌నగర్, బొంతలబస్తీ, బంగ్లాదేశ్ మార్కెట్, ఇందిరానగర్ సెకండ్ వెంచర్ తదితర బస్తీల్లో పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయన ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అభివృద్ధి, సంక్షేమ పథకాలు పేద ప్రజలకు నిరాటంకంగా అందాయని చెప్పారు. ఆచరణ సాధ్యం కాని హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని నెరవేర్చడం చేతకాక ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నదని విమర్శించారు. అర్హులైన వృద్ధులందరికీ కేసీఆర్ హయాంలో పింఛన్లు సకాలంలో వచ్చాయని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పింఛన్లను తొలగిస్తున్నారని, అర్హులకు పింఛన్లు కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వస్తుందని, కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.
పాదయాత్రలో గుర్తించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డీఈ సన్నీ, వాటర్‌వర్క్స్ మేనేజర్ శ్రీధర్, వర్క్ ఇన్స్పెక్టర్ దాసునాయక్, బీఆర్ఎస్ యువ నాయకుడు ముఠా జయసింహ, మీడియా ఇన్చార్జి ముచ్చకుర్తి ప్రభాకర్, నాయకులు శంకర్‌గౌడ్, రహీం, జబ్బర్, చాంద్‌పాషా, మక్బూల్, ఉమాకాంత్, కృష్ణ, ఎల్లేశ్, గోవింద్రాజ్, షకీల్, హజీబాషా తదితరులు పాల్గొన్నారు.