హిమాయత్‌నగర్, అక్టోబర్ 13: దేశం, రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పని చేస్తామని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పబ్బతి శ్రీకృష్ణ స్పష్టం చేశారు. శుక్రవారం హైదర్‌గూడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలు, ఆస్తులను కార్పొరేట్‌కు తాకట్టు పెట్టడంతో నిరుద్యోగం, పేదరికం, ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరిగాయని ఆరోపించారు.
ఆదివాసీ గిరిజన, దళిత, బలహీన వర్గాల మహిళలపై దాడులు, హత్యలు చేసిన ఘనత బీజేపీ నాయకులదేనని అన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరినందుకు ట్రాక్టర్లు, కార్లతో తొక్కించి చంపిన బీజేపీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని పేర్కొన్నారు. మతం పేరిట చిచ్చు పెట్టేందుకు కుట్రలు పన్నుతున్న బీజేపీ ప్రజలు బుద్ధి చేపాల్సిన సమయం ఆసన్నమైనందని పిలుపునిచ్చారు. తెలంగాణలో బీజేపీకి డిపాజిట్లు దక్కకుండా చేయాలని సూచించారు. సమావేశంలో మాల మహానాడు వ్యవస్థాపకుడు బీ రఘునాథ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహేందర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.