కరీంనగర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలు, ఆకాంక్షల మేరకు కరీంనగర్ పట్టణాన్ని స్మార్ట్‌సిటీగా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. మంగళవారం కరీంనగర్ కలెక్టరేట్లో అధికారులు, ప్రజాప్రతినిధులతో పట్టణ అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. హైదరాబాద్‌కు ధీటుగా కరీంనగర్లో పనులు కొనసాగుతున్నాయని అన్నారు.
మార్చి నెలాఖరులోగా పెండింగ్ పనులు, ఐలాండ్స్ పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ చౌక్, వన్ టౌన్ ల వద్ద ఐలాండ్ ల కోసం గుంతలను తవ్వి వదిలవేయడం పట్ల కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో పనులు పూర్తి చేయకపోతే టెండర్ రద్దు చేయాలని అధికారులకు సూచించారు.
సీఎం కేసీఆర్ చొరవతో తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. అధికారులు ప్రజాప్రతినిధుల సహకారంతో కరీంనగరాన్ని గొప్ప నగరంగా తీర్చిదిద్ద గలిగామన్నారు. గతంలో 40 ఫీట్ల రోడ్లతో ప్రజలు అనేక ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. అప్పటి కలెక్టర్ స్మితా సబర్వాల్ సహకారంతో 40 ఫీట్ల రోడ్లను వంద ఫీట్లకు విస్తరించామన్నారు. కరీంనగర్లో జరుగుతున్న సుందరీకరణ పనుల పరిశీలనకు స్మితా సబర్వాల్ ఈ నెల 16న రానున్నారని ఆయన వెల్లడించారు.
ఆమె కరీంనగర్ లో పర్యటించి మానేర్ రివర్ ఫ్రంట్, కేసీఆర్ రెస్ట్ హౌస్, కేబుల్ బ్రిడ్జ్, రోడ్లతో పాటు నగరంలో జరిగిన అభివృద్ధిని పరిశీలించనున్నారని పేర్కొన్నారు. నగరంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనుల కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేక ఫండ్ కింద ఇచ్చిన రూ. 20 కోట్లల్లో 10 కోట్లు కరీంనగర్ రూరల్ కు, పట్టణానికి 10 కోట్లు కెటాయించామన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు. ఇప్పటికే నగరంలో 80 శాతానికి పైగా అభివృద్ధి పనులు పూర్తయ్యాయని మిగతా పనులు కూడా త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ కర్ణన్, అడిషనల్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్, మేయర్ సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి, మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, కార్పొరేటర్లు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.