ఉస్మానియా యూనివర్సిటీ, సెప్టెంబర్ 12: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న తమను పర్మినెంట్ చేయాలని నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జేఏసీ నాయకులు గురువారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్సిటీల అభివృద్ధిలో తమ పాత్రనే ఎక్కువగా ఉన్నదని, ఏండ్లుగా చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా వర్సిటీల్లో అమలు కావడం లేదన్నారు. తక్షణమే ఉద్యోగాలను పర్మినెంట్ చేసి, తమ కుటుంబాల్లో వెలుగులు నింపాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ ప్రతినిధులు పీ సురేశ్, రాము మైలారం, అంజయ్య, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 12(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చేపపిల్లల పంపిణీ ప్రారంభించాలని, లేనిపక్షంలో లక్షమందితో సీఎం రేవంత్‌రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని మత్స్యకారులు హెచ్చరించారు. మత్స్యశాఖ కమిషనరేట్ భవనం ఎదుట మత్స్యకారులు గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మత్స్యకార సంఘం నేత రంజిత్ ముదిరాజ్ మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి ఓ వైపు చెరువులు, కుంటలు కబ్జా చేస్తే ఊరుకోబోమంటూ హైడ్రా పేరుతో డ్రామా చేస్తున్నారని, మరోవైపు అవే చెరువులు, కుంటలపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారులను నాశనం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. చేపల సీడ్‌ను 100శాతానికి పెంచి వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.