హైదరాబాద్, జనవరి 8(నమస్తే తెలంగాణ): తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగా రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో గో ఆధారిత నైవేద్యం సమర్పించేందుకు కృషి చేయనున్నట్టు దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. దేవతామూర్తులకు స్వచ్ఛమైన ఆవుపాలు, నెయ్యి, బియ్యం, పప్పులతో కూడిన నైవేద్యాన్ని అందించాలని కోరుతూ యుగతులసి, సేవ్ ఫౌండేషన్ల ప్రతినిధులు శనివారం హైదరాబాద్‌లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. దేశ వ్యాప్తంగా గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేసే రైతులను ప్రోత్సహించేందుకు వారు పండించిన ఉత్పత్తులను ఆలయాల్లో వినియోగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనివల్ల గో సంతతి కూడా వృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. యాదాద్రి ఆలయంలో స్వామివారికి గో ఆధారిత నైవేద్యాన్ని ప్రవేశపెట్టాలని వారు మంత్రికి సూచించారు. ఈ అంశాలపై మంత్రి సానుకూలంగా స్పందించి ప్రముఖ ఆలయాల్లో అమలుకు కృషి చేస్తామని వెల్లడించారు. మంత్రిని కలిసినవారిలో యుగతులసి చైర్మన్ కె శివకుమార్, సేవ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు విజయ రాజకుమార్ తదితరులు ఉన్నారు.