హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) ప్రమాద సంఘటన నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి పాఠం నేర్వలేదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ప్రమాద ఘటనపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసేందుకు నిపుణులతో కాకుండా, కేవలం సహాయక చర్యల నిమిత్తం ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ చేతులు దులుపుకోవడమే ఇందుకు కారణం. ఆ కమిటీలోనూ ఒకరిద్దరు నిపుణులు తప్ప మిగతా అందరూ అధికారులే ఉండటంపై విమర్శలొస్తున్నాయి. ఎస్ఎల్బీసీ ఇన్లెట్ టన్నెల్లో 13.93 కిలోమీటర్ వద్ద అత్యంత సున్నితమైన షీర్‌జోన్ (పగుళ్లుబారిన, వదులైన రాతిపొరలు ఉన్న ప్రాంతం) వద్ద భారీ నీటి ఊట వస్తున్న నేపథ్యంలో టన్నెల్ పైకప్పు కూలిపోయి ఎనిమిది మంది కార్మికులు గల్లంతయిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఇద్దరి కార్మికుల మృతదేహాలను వెలికితీశారు.
గత 50 రోజులకుపైగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నప్పటికీ, మిగతా ఆరుగురి అచూకీ ఇంకా లభించలేదు. ఈ నేపథ్యంలో సహాయ చర్యలను ముమ్మరం చేసి, ఆ ఆరుగురి ఆచూకీ కనుగొనేందుకు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలపై అధ్యయనం చేసి సిఫారసులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఒక టెక్నికల్ కమిటీని నియమించింది. 12 మందితో కూడిన ఈ కమిటీలో వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేయగలిగే నిపుణులెవరూ లేరని ఇరిగేషన్ శాఖ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీలో ఎన్డీఆర్ఎఫ్ పదో బెటాలియన్ కమాండెంట్, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్ట్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) డైరెక్టర్, నేషనల్ మిషన్ హెడ్-వీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ డైరెక్టర్, టన్నెల్ నిపుణుడు పరిక్షిత్ మెహ్రా, రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్, ఎస్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్, ఎస్డీఆర్ఎఫ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్, ఇరిగేషన్ శాఖ సీడీవో చీఫ్ ఇంజినీర్ ఉన్నారు.
మరో సభ్యుడిగా ఎవరైనా టన్నెల్ నిపుణుడిని నియమించుకునే అవకాశాన్ని కమిటీకి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీలో ఎక్కువ సంఖ్యలో ఆయా ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులు, ఇరిగేషన్ శాఖ అధికారులే ఉండటం గమనార్హం. కేవలం రెస్క్యూ ఆపరేషన్ కోసం కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం చెప్తున్నదని, అయితే, టన్నెల్ నిర్మాణానికి సంబంధించిన పరిస్థితులపై అవగాహన లేకుండా వారేమి చేస్తారని ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ప్రమాద ఘటన ఎలా జరిగింది? ఎందుకు జరిగింది? ఎక్కడ లోపం ఉన్నది? తక్షణం చేపట్టాల్సిన నివారణ చర్యలు ఏమిటి? భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదం సంభవించుకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? తదితర అంశాలపై సమగ్ర అధ్యయనం చేసేందుకు ఇప్పటికే పూర్తిస్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉన్నా సర్కారు ఆ పనిచేయలేదు. కేవలం సహాయక చర్యలకోసమంటూ ఒక కమిటీని వేసి చేతులు దులుపుకున్నదని అధికారులే మండిపడుతున్నారు.
ఆదినుంచీ అదే నిర్లక్ష్యం!
ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటన నేపథ్యంలో అనేక కీలక అంశాలు తెరమీదకు వచ్చాయి. ముందస్తుగా నిర్వహించాల్సిన పరీక్షలు, అధ్యయనం చేయకుండానే పనులను హడావుడిగా ప్రారంభించారనే విమర్శలున్నాయి. కాంట్రాక్ట్ కంపెనీ నిర్వహించిన అనామతు పరీక్షలతోనే పనులకు శ్రీకారం చుట్టడం వల్లే ప్రమాదం వాటిల్లినట్టు కార్మిక వర్గాలు, ఇంజినీర్లు, జియాలజిస్టులు చెప్తున్నారు. ప్రమాదకర జోన్లో చేపట్టాల్సిన రక్షణ చర్యలను కూడా ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శిస్తున్నారు. పూర్తిగా కంపెనీ చెప్పిందే వేదం అన్నట్టుగా వ్యవహరించడం వల్లే ప్రస్తుత దుస్థితి ఎదురైందని నిపుణులు చెప్తున్నారు. ఎస్ఎల్బీసీ ఇన్లెట్ టన్నెల్లో ప్రస్తుతం పనులు కొనసాగుతున్న 14వ కిలోమీటర్ వద్ద ప్రాంతం సున్నితమైనదే కాకుండా అత్యంత ప్రమాదకరమైనదని, దాదాపు 30 నుంచి 50 మీటర్ల మేరకు షీర్‌జోన్ కలిగిన ప్రాంతం ఉన్నదని ఇంజినీర్లు అంటున్నారు.
సొరంగ నిర్మాణాల వైఫల్యాలకు ప్రధానంగా ఇలాంటి జోన్లే కారణంగా నిలుస్తాయని భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అలాంటి జోన్లలో సొరంగ నిర్మాణాలను చేపట్టే సమయంలోనే అనేక రకాలుగా అధ్యయనాలు చేసి, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని వివరిస్తున్నారు. షీర్‌జోన్ అత్యంత ప్రభావితమైన ప్రాంతం కాబట్టి, భూభౌతిక అధ్యయనాల ఆధారంగానే నిర్మాణాలను చేపట్టాల్సి ఉంటుందని భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు స్పష్టంచేస్తున్నారు. ప్రధానంగా భూమిలోని రాళ్ల గట్టిదనాన్ని అంచనా వేసేందుకు సెస్మిక్టోమోగ్రఫీ, భూ పొరల్లోని మార్పులను అర్థం చేసుకునేందుకు గ్రావిటీ సర్వే, భూ ఉష్ణోగ్రతలతో వాటిల్లే మార్పులను గుర్తించేందుకు మ్యాగ్నెటిక్ సర్వే, భూమిలోని నీటి నిక్షేపాలు, వాటి ప్రవాహరీతులు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు రీసిస్టివిటీ టెస్టింగ్, భూ పొరల్లో ఒత్తిడిని ట్రాక్ చేసేందుకు స్ట్రెయిన్గేజ్ తదితర పరీక్షలను నిర్వహించాల్సి ఉంటుందని వివరిస్తున్నారు. భౌగోళిక నమూనాకు సంబంధించిన కచ్చితమైన సమాచారాన్ని సేకరించేందుకు బోర్‌హోల్స్ ద్వారా సర్వేలు నిర్వహించి రాతి రకం, వాతావరణ తీవ్రత తదితర అంశాల ఆధారంగా సైట్ పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకోవాల్సి ఉంటుందని చెప్తున్నారు.
మెటీరియల్ సైన్స్, రాక్ మెకానిక్స్, జియలాజికల్ తదితర విభాగాల సమ్మేళనంతో అధ్యయనం చేయాల్సి ఉంటుందని వివరిస్తున్నారు. ఆయా అధ్యయనాల అనంతరమే నిర్మాణ పనులను ముందుకు తీసుకొనిపోవాల్సి ఉంటుందని భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు స్పష్టంచేస్తున్నారు. షీర్ ఒత్తిడిని తట్టుకునేందుకు ప్రత్యేకమైన కాంక్రీట్, స్టీల్ వాడాల్సి ఉంటుందని, లోతైన ప్రదేశంలో ఫౌండేషన్ వేయాల్సి ఉంటుందని వారు చెప్తున్నారు.
మరిన్ని షీర్జోన్లు!
శ్రీశైలం రిజర్వాయర్ నుంచి దిండి రిజర్వాయర్ వరకు మొత్తంగా 43.5 కిలోమీటర్ల సొరంగాన్ని తవ్వాల్సి ఉన్నది. ఇప్పటివరకు 34.372 కిలోమీటర్ల సొరంగం పనులు పూర్తికాగా, ఇంకా 9.560 కి.మీ. మేర తవ్వాల్సి ఉన్నది. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పనుల ప్రారంభ సమయంలోనే 43.5 కిలోమీటర్ల టన్నెల్ అలైన్మెంట్ మార్గంలో దాదాపు 11 షీర్జోన్లు ఉన్నట్టు గుర్తించారు. ఇప్పటివరకు ఆరు జోన్లను అధిగమించారు. ప్రస్తుతం ఇన్లెట్ టన్నెల్లో 13.93 కి.మీ. వద్ద ఉన్న షీర్ ప్రాంతంలో ప్రమాదం సంభవించింది. ఈ టన్నెల్ తవ్వాల్సిన మార్గంలో ఇంకా నాలుగు షీర్జోన్లు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. ఆయా ప్రాంతాల్లో పనులు జరిగేటప్పుడు ఇలాంటి ప్రమాదమే సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి, షీర్‌జోన్ ప్రాంతాల్లో ఎలాంటి సురక్షిత పద్ధతుల్లో సొరంగం తవ్వకాలు చేపట్టాలి? ఏ సాంకేతికతను వినియోగించాలి? అనుసరించాల్సిన వ్యూహాలేమిటి? అనే అంశాలపై అధ్యయనం చేయాల్సిన అవసరం ఉన్నదని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. కానీ, సర్కారు ఇప్పటికీ ఆ పని చేయడం లేదు.