నెక్కొండ/వర్ధన్నపేట/నల్లబెల్లి, ఏప్రిల్ 15 : మక్కల కొనుగోలు చేపట్టకపోవడం, పైగా ఆంక్షలు విధించడాన్ని నిరసిస్తూ బుధవారం వరంగల్ జిల్లాలోని పలుచోట్ల రైతులు ఆందోళనకు దిగారు. నెక్కొండలో మార్కెట్ గేటుకు తాళం వేయడంపై భగ్గుమన్నారు. వర్ధన్నపేట మండలం ఇల్లందు, నల్లబెల్లి మండలం రుద్రగూడెంలో రాస్తారోకో చేపట్టారు. నెక్కొండ వ్యవసాయ మార్కెట్లో మక్కలు అన్లోడ్ చేసేందుకు స్థలం లేదని, రైతులు మూడు రోజులపాటు మార్కెట్‌కు మక్కలు తీసుకురావద్దంటూ నిర్వాహకులు, సొసైటీ సీఈవో మోడెం సురేశ్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
చైర్మన్ రావుల హరీశ్‌రెడ్డి ఆదేశాల మేరకు మార్కెట్ సిబ్బంది మార్కెట్లోకి మక్కల వాహనాలు రాకుండా గేట్లకు తాళాలు వేశారు. బుధవారం ఉదయం మక్కలను మార్కెట్‌కు తీసుకొచ్చిన రైతులు గేట్లకు తాళాలు వేయడంతో మార్కెట్‌కు గేటు ఎదురుగా నెక్కొండ -ప్రధాన రహదారిపై ట్రాక్టర్లను అడ్డంగా పెట్టి రోడ్డును దిగ్బంధించారు. ఎస్సై చొరవతో మార్కెట్ గేటుకు తాళాలు తీయించడం రైతులు శాంతించారు.
కాగా వర్ధన్నపేట మండలం ఇల్లంద మార్కెట్ యార్డు లో కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో రైతులు వరంగల్-ఖమ్మం హైవేపై రాస్తారోకో చేపట్టారు. అధికారులు, నిర్వాహకుల హామీ తో ఆందోళన విరమించారు. మక్కలు చివరి గింజ వరకూ కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం నల్లబెల్లి మండలం రుద్రగూడెంలో హైవేపై రాస్తారోకో చేపట్టారు. మండలానికి ఒక్కటే మక్కల కొనుగోలు కేంద్రం ప్రారంభించి, ఆంక్షల పేరుతో తీవ్ర ఇబ్బం దులు పెడుతున్నదని మండిపడ్డారు.