కేసముద్రం, ఏప్రిల్ 11 : పదిరోజులు దాటినా మక్క జొన్నలు కొంటలేరని రైతులు మహబూబాబాద్ కలెక్టర్ స్నేహా శబరీశ్‌తో మొరపెట్టుకున్నారు. శనివారం ఆమె కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించి పేరుకుపోయిన జొన్నల రాశులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె వద్దకు వచ్చిన రైతులు మార్కెట్లో తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెట్టారు. మక్కలు కొనుగోలు చేయడంలో మార్క్‌ఫెడ్ జాప్యంతో రోజుల తరబడి మార్కెట్లోనే ఉండాల్సిన పరిస్థితి వస్తున్నదని ఆవేదన వ్య క్తంచేశారు.
ఇక్కడి ఇబ్బందులు తట్టుకోలేక కొంతమంది రైతులు తక్కువ ధరకు ప్రైవేట్ వ్యాపారులకు విక్రయిస్తూ నష్టపోతున్నారని తెలిపారు. ఈ సమస్యపై కలెక్టర్.. మార్కెట్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోళ్లలో జాప్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కొనుగోళ్లలో వేగం పెంచాలని, హమాలీలు, కూలీలను ఎక్కువ మందిని తీసుకొచ్చి త్వరితగతిన కాంటాలు, తోలకాలు చేపట్టాలని ఆదేశించారు. మార్క్‌ఫెడ్, మార్కెట్ అధికారులు సమన్వయంతో పనులు చేపట్టాలని సూచించారు.