హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): రైల్వేస్టేషన్లలో నేరాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్టు రైల్వే, రోడ్ సేఫ్టీ ఏడీజీ మహేశ్ భగవత్ వెల్లడించారు. సికింద్రాబాద్ రైల్వే పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల మలక్‌పేట రైల్వేస్టేషన్లో సెల్‌ఫోన్ కోసం ఓ వ్యక్తిని హతమార్చిన నిందితుడు మహమ్మద్ సోహైల్‌ను అరెస్టు చేసినట్టు తెలిపారు.
మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు. అతని కుడి చేతిపై ‘అమ్మ’ అనే పచ్చబొట్టు ఉన్న ఫొటోలతోపాటు ఇతర ఫొటోలను ఏడీజీ విడుదల చేశారు. బుధవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న చిన్నయ్యను తనిఖీ చేయగా అతని వద్ద 15 గ్రాముల బంగారు గొలుసు దొరికిందని తెలిపారు. అదుపులోకి తీసుకొని విచారించగా చైన్‌స్నాచర్ అని తేలిందని చెప్పారు. విచారణలో 5 చైన్‌స్నాచింగ్ నేరాలు చేసినట్టు నిందితుడు చిన్నయ్య ఒప్పుకున్నట్టు తెలిపారు.