హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): సీనియర్ నటుడు కృష్ణ పెద్దకుమారుడు, హీరో మహేశ్‌బాబు సోదరుడు ఘట్టమనేని రమేశ్‌బాబు (56) అనారోగ్యంతో శనివారం కన్నుమూశారు. కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యులు ఆయనను హుటాహుటిన గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానకు తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యు లు ధ్రువీకరించారు. ప్రస్తుతం భౌతికకాయాన్ని దవాఖాన మార్చురీలో ఉంచారు. ఆదివారం ఉదయం తీసుకెళ్లనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. అంత్యక్రియలు ఆదివారం నిర్వహించనున్నట్టు తెలిసింది. రమేశ్‌బాబుకు భార్య మృదులతోపాటు కుమార్తె, కుమారుడు ఉన్నారు. రమేశ్‌బాబు మరణంతో తెలుగు సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు రమేశ్‌బాబు మృతిపట్ల సంతాపం ప్రకటించారు. రమేశ్‌బాబు తమ హృదయాల్లో సదా నిలిచి ఉంటారని ఘట్టమనేని కు టుంబం తెలిపింది. ఆయన అంత్యక్రియలను కొవిడ్ నిబంధనల మేరకు నిర్వహిస్తాయని, అక్కడ ఎవరూ గుమికూడవద్దని విజ్ఞప్తిచేసింది.
తండ్రి కృష్ణ కథానాయకుడిగా నటించిన ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రంతో బాలనటుడిగా రమేశ్‌బాబు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. ‘సామ్రాట్’ సినిమాతో హీరోగా అరంగేట్రం చేసి తొలి సినిమాతోనే పెద్ద విజయాన్ని అందుకొన్నారు. బజార్‌రౌడీ, కృష్ణగారి అబ్బాయి, బ్లాక్‌టైగర్, ఆయుధం, కలియుగ అభిమన్యుడు, నా ఇల్లే నా స్వ ర్గం, అన్నాచెల్లెలు, చిన్నికృష్ణుడు, పచ్చతోరణం సినిమాలతో కథానాయకుడిగా మెప్పించారు. తండ్రి కృష్ణ, సోదరుడు మహేశ్‌బాబు తో కలిసి ‘ముగ్గురు కొడుకులు’ సినిమాలో నటించారు. 1997లో ఎన్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘ఎన్కౌంటర్’ తర్వాత రమేశ్‌బాబు నటనకు దూరమయ్యారు. అనంతరం తండ్రి పేరుతో కృష్ణ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థను ప్రారంభించారు. తన సోదరుడు మహేశ్‌బాబు హీరోగా ఆయన నిర్మించిన అర్జున్, అతిథి, దూకుడు సినిమాలు పెద్ద విజయాల్ని సాధించాయి.