మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న వాహన కాలుష్యాన్ని అరికట్టేందుకు మహబూబ్‌నగర్ అర్బన్ మం డలం దివిటిపల్లి వద్ద ఉన్న ఐటీ పార్కులో అమరరాజా సంస్థ ఏర్పాటు చేయనున్న లిథియం గిగా సెల్ కంపెనీ దేశంలోనే మొట్టమొదటిదని ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. శనివారం మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ఎదిరలో ఈద్గా పనులను పరిశీలించిన అనంతరం మంత్రి మీడియా తో మాట్లాడారు. రూ.10 వేల కోట్లతో ఏర్పాటు చేస్తున్న బ్యాటరీ కంపెనీ వల్ల పదివేల మందికి ప్రత్యక్షంగా, వేలాది మందికి పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఐటీ టవర్ నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయని అన్నారు. ఎదిర, దివిటిపల్లి సమీపంలో ఇప్పటికే ఐటీ పార్కు నిర్మాణం పూర్తి కావచ్చింద ని చెప్పారు. లిథియం గిగా కంపెనీ ఏర్పాటుతో పాలమూరు జిల్లా దశ మారనున్నదని అన్నారు.
కశ్మీర్లో ఇటీవల కనుగొన్న లిథియం నిల్వలపై ప్రపంచమంతా ఎన్నో ఆశలు పెట్టుకున్నదని ఆయన పేర్కొన్నారు. ఎలక్రిక్టల్ వాహనాలకు అవసరమైన బ్యాటరీలకు లిథియం గుండెకాయ లాంటిదని తెలిపారు. ఈ-వాహనాల వల్ల ప్రపంచంలోని వాహన కాలుష్యాన్ని తరిమికొట్టే అవకాశం ఉన్నదని అన్నారు. మేధావులు, విద్యావంతులు, యువత ఆలోచించి పరిశ్రమ ఏర్పాటుకు సహకరించాలని కోరారు. ఈ పరిశ్రమపై కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తూ.. ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. వారి కుట్రలను ఇక సాగనివ్వబోమని హెచ్చరించారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఏర్పాటు చేస్తున్న పరిశ్రమను అడ్డుకుంటే ద్రోహులుగా మిగిలిపోతారని స్పష్టం చేశారు.