హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తేతెలంగాణ): మహాత్మాజ్యోతిరావుఫూలే మార్గంలో నడుస్తూ ప్రతిఒక్కరూ బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి పాటుపడాలని కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శుక్రవారం ఘనంగా ఫూలే జయంత్యుత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటం వద్ద ఘనంగా నివాళులర్పించారు. ఆ మహనీయుడి సేవలను స్మరించుకున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు ఫూలే పేదల కోసం తన జీవితాన్ని ధారపోశారని కొనియాడారు. ఫూలే చూపిన బాటలో రాష్ట్రంలో 1,022 గురుకులాలను ఏర్పాటు చేసి, పేదింటి బిడ్డలకు నాణ్యమైన చదువునందించారని అన్నారు.
విదేశాలకు వెళ్లిన 7వేల మంది బీసీ విద్యార్థులకు రూ. 20 లక్షల చొప్పున స్కాలర్షిప్లు మంజూరు చేసి వారి బతుకుల్లో వెలుగులు నింపారని గుర్తుచేశారు. జ్యోతిబా ఫూలేను అందరూ స్ఫూర్తిగా తీసుకొని సామాజిక సేవలో పాలుపంచుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. మాజీ మంత్రులు వీ శ్రీనివాస్‌గౌడ్, పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్, నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, గెల్లు శ్రీనివాస్‌యాదవ్, కురువ విజ య్, కిశోర్‌గౌడ్, తుంగబాలు, అభిలాష్ రంగినేని, వై సతీశ్‌రెడ్డి, బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షు డు బాబన్న, మారయ్య తదితరులున్నారు.