మహబూబాబాద్ రూరల్, జనవరి 2: మహబూబాబాద్ మహాత్మా జ్యోతిరాఫూలే గురుకుల విద్యార్థులు సెల్‌ఫోన్ విషయంలో ఘర్షణపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. గురుకులంలో వాటర్ పోయడానికి బుధవారం మధ్యాహ్నం ఆటోలో వాటర్మాన్ రాగా, క్యాన్లను కౌంట్ చేసేందుకు 9వ తరగతి విద్యార్థి రాజేందర్‌ను టీచర్లు అక్కడ ఉంచారు. వాటర్మాన్ తన సెల్‌ఫోన్‌ను రాజేందర్‌కు ఇవ్వగా, 10వ తరగతి విద్యార్థి రేవంత్ వచ్చి ఫోన్ చేసుకుంటానని అడగగా ఇవ్వలేదు. దీంతో రేవంత్ అర్ధరాత్రి స్నేహితులతో కలిసి రాజేందర్‌ను కొట్టడంతో అతడు వ్యాయామ ఉపాధ్యాయుడికి ఫిర్యాదుచేశాడు.
గురువారం ఆ ఉపాధ్యాయుడు రేవంత్‌ను కర్రతో కొట్టడంతో తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. వారు వచ్చి వ్యాయామ ఉపాధ్యాయుడితో ఘర్షణ పడగా విద్యార్థులను పిలిపించి ఘటనను వివరించడంతో పేరెంట్స్ వెళ్లిపోయారు. ప్రిన్సిపాల్ రాజేశ్‌ను వివరణ కోరగా రాజేందర్‌ను రేవంత్, అతడి స్నేహితులు కొట్టారని, ఈ విషయంపై టీచర్లతో విచారించి ఐదుగురు విద్యార్థులను పాఠశాల నుంచి సస్పెండ్ చేసినట్టు వెల్లడించారు.