హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): పరాయిపాలన నుంచి దేశానికి స్వాతంత్య్రం సాధించడం కోసం గాంధీజీ అనుసరించిన శాంతియుత పోరాటపంథా, ప్రపంచ ప్రజాస్వామిక ఉద్యమాలకు, స్వయంపాలనకు మార్గదర్శకంగా నిలిచిందని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన దేశానికందించిన సేవలను, చేసిన త్యాగాలను కేసీఆర్ స్మరించుకున్నారు.
పీడిత వర్గాలు శాంతియుత మార్గంలో ఐక్యతను సాధించి పోరాడినప్పుడే తమ గమ్యాన్ని చేరుకోగలరనే సందేశాన్ని గాంధీజీ ప్రజాస్వామిక ఉద్యమ కార్యాచరణ మనకు అందిస్తుందని పేర్కొన్నారు. అసాధ్యమనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో గాంధీజీ స్ఫూర్తి ఇమిడి ఉన్నదని వివరించారు. సబ్బండ వర్గాలు, సకలజనులు అభివృద్ధి చెంది, గ్రామ స్వరాజ్యం పరిఢవిల్లేలా పదేండ్ల బీఆర్ఎస్ పాలన సాధించిన ప్రగతి వెనుక గాంధీ మహాత్ముని ఆశయాలు, ఆదర్శాలు ఉన్నాయని తెలిపారు. సహనంతో కూడిన దార్శనికతను ప్రదర్శించడం ద్వారానే సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మరింత ప్రగతి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. తద్వారా మాత్రమే మనం గాంధీజీకి ఘన నివాళి అర్పించినవారముతామని స్పష్టంచేశారు.